ఆదిలాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతన్నను మోసం చేసింది. ధాన్యం కొంటామని చెప్పి చేతులెత్తేసింది. దిక్కుతోచని విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. కేంద్రం కొనకపోయినా.. రాష్ర్టానికి వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా.. వడ్ల కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. త్వరలో కొనుగోళ్లు కూడా ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరిగానే ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని.. రైతులెవ్వరూ తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.46 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 2.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోగా.. ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడడమే కాకుండా అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
“వరి ఎంతైనా సాగు చేయండి.. కేంద్రం ద్వారా మేము ధాన్యం కొనుగోలు చేయిస్తాం. అది మా బాధ్యత. ఎవరూ భయడాల్సిన అవసరం లేదు.” అంటూ యాసంగి సాగు ఆరంభం సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు బీరాలు పలికారు. కొనుగోలు చేయించే బాధ్యత తమదే అంటూ ప్రెస్మీట్లు పెట్టి మరి చెప్పారు. ప్రస్తుతం పంట చేతికొస్తున్న సమయంలో కొన్నాళ్లుగా కేంద్రం కొర్రీలు పెడుతుంటే చూస్తూ ఒక్కరు ఒక్క మాట అనకపోగా.. తిరిగి కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు.
నాడు ఏ పంటైనా కొంటామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ.. నూకలు తినండంటూ అవహేళన చేస్తున్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నూకల బియ్యం తినండంటూ రాష్ట్ర ప్రజలను అవహేళన చేసినా.. బీజేపీ నేతలు మాట్లాడకపోవడం వారి డొల్లతనం బయటపడింది. అంతేకాదు.. యాసంగి పంట సమయంలో నోరు విప్పి చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం తలోమాట మాట్లాడుతూ కేంద్రం బాటలో నడుస్తున్నారు. పంటలు పండించిన రాష్ట్ర రైతాంగానికి అండగా నిలువకుండా.. ఢోకా బాజీ మాటలు చెబుతున్నారు. అనాడు కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని చెప్పిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ విషం కక్కుతున్నారు. మొత్తంగా చూస్తే.. ధాన్యం కొనుగోలు విషయంలో రిక్తహస్తం చూపిన కాషాయపార్టీ తన కపట నాటకాలను బయటపెట్టింది.
తొలిగిన ఉత్కంఠ
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి ప్రకటించడంతో కొన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రోజురోజుకు మారుతున్న పరిణామాలు, కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఇన్నాళ్లు రైతుల్లో ఉండేది. కేంద్రం మాట తప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ కొని తీరుతారన్న నమ్మకం రైతుల్లో కనిపించేది. చివరికి ఆ మాటే నిజమైంది. రైతును రాజును చేసేందుకు ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఒక పండుగలా మార్చిన కేసీఆర్ ఇప్పుడు అదే కోణంలో రైతుల పక్షాన నిలిచారు. కేంద్రంపై ఒక వైపు పోరు చేస్తూనే.. పండించిన పంట రోడ్లపై ఉండిపోకుండా అన్నదాత ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. మరోసారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లా రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
బీజేపీకి ఉసురు తగులుతది..
కుంటాల, ఏప్రిల్ 12 : తెలంగాణ రైతులను అడుగడుగునా అవమానిస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో బరాబర్ బుద్ధి చెబుతం. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టిన బీజేపీని అన్ని రాష్ర్టాల్లో ఇగ రైతులు బొంద పెట్టడం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 1960 ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో రైతులంతా ఆనందంగా ఉన్నరు. కేసీఆర్ వేసే ప్రతి అడుగులో అన్నదాతలు భాగస్వామ్యులై ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాం.
–తాటి మహేశ్, రైతు, కుంటాల
కేసీఆర్ న్యాయం చేస్తున్నారు..
సోన్, ఏప్రిల్ 12 : తెలంగాణ రాష్ట్రంలో వడ్ల పంచాయతీని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేక చేతులెత్తేసింది. రాష్ట్ర సర్కారు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వద్దని చెప్పినా మా పొలంలో వడ్లు తప్పా మిగతా పంటలు పండేవి కావు. అందుకే వరి వేసినం. కేంద్రం కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ సారు వడ్లు కొంటామని చెప్పినందుకు మా కష్టాలన్ని తీరిపోతాయి.
– భూషణ్, రైతు, వెంగ్వాపేట్
కేసీఆర్‌పై విశ్వాసం పెరిగింది..
సోన్, ఏప్రిల్ 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన దొడ్డు రకం వరి కొనాలని మూడు నెలలుగా పోరాటం చేసినా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణ రైతులను చులకన చేసి మాట్లాడారు. సోమవారం ఢిల్లీలో వడ్లు కొనాలని 24 గంటల డెడ్‌లైన్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టిన రైతుల గురించి ఆలోచించలే. ముఖ్యమంత్రి ఇప్పుడు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొంటామని ప్రకటించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– ఎల్చల్ రమేశ్‌రెడ్డి, రైతు, పాక్పట్ల