ఇంద్రవెల్లి, ఏప్రిల్ 12 : ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనుల ఉత్సవాలతో పాటు సంస్కృతీ సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. పెర్సపేన్ ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరుచేసిందని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మాజీ ఎంపీపీ కనక తుకారం నివాసం వద్ద మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పెర్సపేన్ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల కోసం బ్యాంకులో తీసిన ఖాతా ఫారాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 160 పెర్సపేన్ ఆలయాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందన్నారు.
25వ తేదీ నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ గొడం నగేశ్, ఎంపీ సోయం బాపురావ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. పనులను 3 నెలల్లో పూర్తిచేసేందుకు ప్రణాళిక చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనక తుకారాం, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, తుడుందెబ్బ మండలాధ్యక్షుడు జుగ్నక్ భారత్, ఆదివాసీ పెద్దలు రామారావ్, మహరాజ్ సురేశ్, జూకు, తొడసం దేవ్రావ్, కోవ లాల్షావ్, జుగ్నక్ జాలిమ్షావ్, మెస్రం దేవ్రావ్ పాల్గొన్నారు.