తాంసి, ఏప్రిల్ 12ః ఉపాధిహామీ కూలీలకు పనిప్రదేశంలో ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మండలంలోని పొన్నారిలో ఉపాధిహామీ పనులు, పల్లెప్రకృతి వనం, హరితహారం నర్సరీ, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. తాగునీటి సౌకర్యం, నీడ సౌకర్యం కల్పించాలని కూలీలు కోరారు. ఉపాధిహామీ కూలీ డబ్బులు ఇవ్వడంలో బీపీఎం సురేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ జిల్లా పోస్ట్మాస్టర్తో మాట్లాడి బీపీఏంపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం హరితహారం నర్సరీని, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. జూన్ నాటికి మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రకృతి వనంలో పండ్లమొక్కలు, పూల మొక్కలు పెంచాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. వారికి ప్రీఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కుల ను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. క్రమం తప్పకుండా చదివితే పరీక్షలు బాగా రాయవచ్చన్నారు. ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో ఆకుల భూమయ్య, సర్పంచ్ సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీ రఘు, ఉపసర్పంచ్ అశోక్, పంచాయితీ కార్యదర్శి విజయ్‌కుమార్ ,టీఏ రాజన్న తదితరులున్నారు.