నిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డుసభ్యులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల ముసాయిదా సమగ్రంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీల్లో అతికించినట్లు తెలిపారు. జాబితాలో పేర్లు లేని వారు పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఈనెల 16 వరకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. జిల్లాలో మొత్తం 11 సర్పంచ్‌లు, 217 వార్డు సభ్యులు, 3 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, రాజకీయ పార్టీల నేతలు రమేశ్‌రెడ్డి, భీంరెడ్డి, రమేశ్, మజర్, భరత్, సాయికిరణ్, గంగాధర్, రాజు పాల్గొన్నారు.