కడెం, ఏప్రిల్ 10 : వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి దాని ద్వారా పంటలను సాగు చేస్తూ, ప్రతి ఏడాది వానకాలం, యూసంగి పంటలు పండిస్తూ ఇక్కడ వ్యవసాయం ఎప్పుడు పండుగే అన్నట్లు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కడెం మండలంలోని పాండ్వాపూర్, కొండుకూర్, బెల్లాల్, అంబారిపేట, దేవునిగూడెం, మొర్రిగూడెం, చిన్నబెల్లాల్ గ్రామాల రైతులు ప్రతి సంవత్సరం రెండు పంటలు పండిస్తూ కరువును ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలకు సమీపంలో సాగునీరు పుష్కలంగా ఉంటుంది. దానిని ఒడిసిపట్టి మోటార్ల ద్వారా వారి పంటలకు వినియోగించుకుంటున్నారు.
రైతులు మోటార్ల ద్వారా మళ్లిస్తూ..
కడెం జలాశయం 18 వరద గేట్ల ద్వారా ప్రతి ఏడాది వేల క్యూసెక్కుల లీకేజీ నీరు వాగు నుంచి నేరుగా గోదావరిలో కలుస్తుంది. వాగులో ఇక్కడి రైతులు విద్యుత్ మోటర్లను ఏర్పాటు చేసుకొని పైపులైన్ల ద్వారా పంట పొలాలకు నీరు మళ్లిస్తున్నారు. ప్రతి ఏడాది అధిక దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం యాసంగిలో 10వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. పంటపొలాలకు మోటార్లే ప్రధానం కావడంతో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో ఇబ్బందులు లేవు. ఈ ప్రాంతంలో ఎప్పడూ నీరు పుష్కలంగా ఉంటుంది. కడెం నదికి ఇరువైపులా చూస్తే ఈ ప్రాంతమంత ఎండాకాలం కూడ పచ్చని పొలాలతో కళకళలాడుతుంది. నిరంతరం విద్యుత్ మోటర్లు నడవడంతో ఎప్పుడు పంటపొలాల్లో జీవధారామనే చెప్పాలి. వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి పంటలు సాగు చేస్తూ ఇక్కడి రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాగునీటికి ఢోకా లేదు
కడెం వాగు ద్వారా మాకు ప్రతి ఏడాది రెండు పంటలకు సాగునీరు అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో పంటలకు సాగునీరు ఢోకా లేదు. వానకాలం స్థాయిలో యాసంగిలో కూడ వరి పంటలు సాగు చేస్తున్నాం. నిత్యం నీటితో మా ప్రాంతంలో పంట పొలాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
–గోపు రాజమౌళి, రైతుల, పాండ్వాపూర్