మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ నియోజకవర్గంలో 261 మందికి చెక్కుల పంపిణీ
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకంతో శాశ్వత ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని రైతు వేదికలో బుధవారం దళితబంధు చెక్కులను పంపిణీ చేశారు. నిర్మల్ నియోజకవర్గంలోని 261 మందికి రూ. 26.10 కోట్ల విలువైన చెక్కులను మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేశామని చెప్పారు. రూ.10లక్షలతో స్థానికంగా ఉపా ధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త పారిశ్రామిక రంగాలను ఎంచుకున్నప్పుడే శాశ్వత ఉపాధి పెరుగుతుందన్నారు.
రాష్ర్టానికే తలమానికం అంబేద్కర్ ఆడిటోరియం
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 6 : నిర్మల్‌లో రూ.5 కోట్లతో నిర్మించిన అంబేద్కర్ ఆడిటోరియం రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ భవనం పక్కన చేపట్టిన అంబేద్కర్ భవన నిర్మాణ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిర్మల్‌లోనే అత్యాధునిక హంగులతో విశాలమైన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి గతంలో ఈ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారని, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈభవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ దశల వారీగా నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ నెల 18న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అంబేద్కర్ భవన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా, ఇతర అధునాతన వసతులతో తీర్చిదిద్దారని వెల్లడించారు.
‘మన ఊరు-మన బడి’తో పూర్వ వైభవం
సోన్, ఏప్రిల్ 6 : పాఠశాలలకు పూర్వ వైభవాన్ని అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో రూ. 11.22 లక్షలతో చేపట్టిన పాఠశాల భవన నిర్మాణానికి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎల్లపెల్లి పాఠశాలను ‘మన ఊరు -మన బడి’ కింద ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో 335 పాఠశాలలు ఎంపిక కాగా.. 260 స్కూళ్లలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నామని తెలిపారు. దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఈవో రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ హన్మాండ్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి రాజేశ్వర్‌గౌడ్, డీఆర్డీవో విజయలక్ష్మి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్, సారంగాపూర్ ఎంపీపీలు కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, అట్ల మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, ముడుసు సత్యనారాయణ, పరిశ్రమలశాఖ అధికారి నర్సింహారెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, పీఆర్ ఈఈ శంకరయ్య, హెచ్ఎం పరమేశ్వర్ పాల్గొన్నారు.