తాంసి, ఏప్రిల్ 6 : ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని నిరాలలో చేపట్టిన ఉపాధిహామీ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఉదయమే పనులకు వెళ్లాలని కూలీలకు సూచించారు. ఒకే పూట పనులు ఉండాలని కూలీలు కలెక్టర్‌ను కోరారు. దేశం మొత్తం ఒకే పాలసీ ఉందని, రెండు పూటలా పనులకు వెళ్లాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఏపీవో రాథోడ్ రవీందర్, ఎంపీడీవో గజానన్‌రావు, ఏపీవో జగ్గేరావు ఉన్నారు.
ఈజీఎస్ పనుల పరిశీలన
బేల, ఏప్రిల్ 6 : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం పరిశీలించారు. కూలీల సంఖ్యను పెంచాలని, జాజ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పనుల వివరాలు, ఫొటోలను నూతనంగా రూపొందించిన నేషనల్ మాస్టర్ మేనేజ్మెంట్ సిస్టం( NMMS) యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో మరుగుదొడ్లను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఆధికారులకు సూచించారు. మండలంలోని కూలీలలకు పనులు పని కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, ఈ నెల ప్రారంభం నుంచి పనులు కల్పించడం లేదని సర్పంచ్‌లు వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, విపిన్ ఖోడే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించి సాయంత్రం లోగా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకొని నివేదిక అందించాలని డీఆర్డీవో కిషన్, ఏడీఆర్డీవో రాథోడ్ రవీందర్‌కు సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్ , తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ఎదులాపురం, ఏప్రిల్ 6: జిల్లాలో మన ఊరు- మన బడి’లో ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం అమలుపై కలెక్టరేట్ నుంచి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో ఎంపికైన 237 పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రూ.30 లక్షల లోపు వ్యయంతో చేపట్టే పనుల ప్రతిపాదనలను పరిపాలనా అనుమతుల కోసం తక్షణమే పంపాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు స్వయం గా సందర్శించి ప్రతిపాదనలను ధ్రువీకరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఆర్డీఏ కిషన్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ నర్సయ్య, పీఆర్ ఈఈ మహావీర్, మున్సిపల్ ఈఈ వెంకటశేషయ్య ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.