ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జ
హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకంపై సమీక్ష
ఎదులాపురం, ఏప్రిల్ 6 : ఆదిలాబాద్ జిల్లాలో దళిత బంధు పథకం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జ సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా దళితబంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. లాభసాటిగా ఉండే యూనిట్లపై గ్రామాల వారీగా లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటి విడుతలో జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని 248 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పారు.
గ్రామాల వారీగా లబ్ధిదారులకు లాభసాటిగా ఉండే యూనిట్లపై అవగాహన కల్పించినట్లు వివరించారు. మినీ డెయిరీ, ఆటో ట్రాలీ, గొర్రెలు, మేకలు తదితర యూనిట్ల స్థాపన కోసం 171 మంది లబ్ధిదారులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో యూనిట్ల ఎంపిక కోసం లబ్ధిదారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, పరిశ్రమల శాఖ అధికారి పద్మభూషణ్‌రాజు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రంగారావు, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.