ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 6 : మండలంలోని కుమ్మరితండా గ్రామంలో తయారు చేసిన రంజన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారు చేసే రంజన్లలోని నీరు చల్లగా ఉంటాయి అందుకే ప్రసిద్ధి. చాలా ఏళ్ల నుంచి ఇక్కడి కుమ్మరి కులస్థులు తమ వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. రంజన్లే కాకుండా కుండలు, మట్టి పాత్రలు తయారు చేస్తారు. రంజన్లు మండలంతో పాటు జిల్లాలకు సరఫరా చేస్తారు.
తయారీ విధానం ఇలా…
ముందుగా నీటి కుంటలలోని ఒండ్రు మట్టిని తీసుకువచ్చి సన్నగా పగులగొట్టి నీరు పోసి మెత్తగా కలుపుతారు. ఆ తర్వాత మట్టిలో గుర్రపు పేడ మట్టిని కలుపుతారు. మట్టితో రంజన్లు బట్టికి సరిపడేందుకు కావాల్సినన్ని తయారు చేసి ఎండలో ఆరబెట్టి 100 రంజన్లు ఒకేసారి కట్టెలతో కాల్చుతారు. 50 కిలోల గుర్రం పేడ రూ.500 వెచ్చించి ఆదిలాబాద్ నుంచి తీసుకువస్తారు. గుర్రపు పేడ కలపడంతోనే నీరు చల్లగా ఉంటాయి.
కుటుంబానికి ఉపాధి
ఇంటిల్లి పాది కష్టపడితే ఒకే సీజన్ 50వేల వరకు సంపాదిస్తాం. ఒక రంజన్ 100 నుంచి 105 వరకు విక్రయిస్తున్నాం. ఎండాకాలంలో ఐదు నెలల పాటు ఇదే పని చేస్తాం. కుటుంబానికి మంచి ఉపాధి లభిస్తుంది.
–కేలేటి సుభాష్, కుమ్మరితండా