కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ) /నేరడిగొండ, ఏప్రిల్ 2 : ఎండలు ముదురుతున్నాయి. 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడవుల్లో వన్యప్రాణులకు నీటి కటకట మొదలైంది. దాహాన్ని తీర్చుకోవడానికి జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిపై అటవీశాఖ సిబ్బంది దృష్టిసారించింది. దప్పిక తీర్చేందుకు సాసర్ పీట్లు, ర్యాంప్‌వెల్స్, నీటి గుంతలు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేస్తున్నది. అడవుల్లోకీ ట్యాంకర్ల ద్వారా నీటిని కూడా తరలిస్తున్నారు. ఇదే సమయంలో అడవుల్లో కార్చిచ్చును ఆపేందుకు యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నికీలల నుంచి జంతువులను కాపాడేందుకు ప్రత్యేకంగా ఫైర్లైన్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. రాత్రింబవళ్లు తిరుగుతూ కంటికి రెప్పలా అడవితల్లిని కాపాడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అడవులు, వన్యప్రాణుల రక్షణకు తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వేసవికాలంలో జంతువులు, పక్షుల దాహార్తి తీ ర్చేందుకు సాసర్ పీట్లు, ఇంకుడు, నీటినిల్వ గుంతలు, సహజ సిద్ధం గా ఉన్న నీటి కుంటలు, చెలిమెలు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 120 సాసర్ పీట్లు ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. వీటితోపాటు పర్పులేషన్ ట్యాంకులను కూడా నిర్మించారు. కుంటల్లో నీటిని నింపేందుకు గతేడాది రెండు సోలార్ పంపులను కూడా ఏర్పాటు చేసినట్లు పెంచికల్ పేట్ అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 19 సాసర్ వెల్స్, ర్యాంప్‌వెల్స్, చెక్ డ్యాంలు నిర్మించారు. శాకాహార జంతువుల ఆహారం కోసం గడ్డిక్షేత్రాలు పెంచుతున్నారు. పులుల సంచారం పెరుగడంతో శాకాహార జంతువుల రక్షణకు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. జింకలు, దుప్పులు, కుందేళ్లు, ఇతర శాకాహార జంతువులకు ఆహారం, నీటికొరత రాకుండా ప్రత్యేక దృష్టి సారించారు.
నిప్పుపై అప్రమత్తం..
ప్రతి వేసవిలో ఆకులు వట్టిపోయి నేలరాలుతాయి. మంటలు అంటుకునే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం రోడ్లు మార్గంలో వెళ్లే బాటసారులు, వాహనదారులు కాల్చిన బీడీలు, సిగరెట్లను పడేయడమే. దీంతో అడవుల్లోని వృక్షాలతోపాటు జీవాలకు కూడా నష్టం వాటిల్లుతున్నది. దీన్ని నిరోధించడానికి అటవీశాఖ ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్‌పెల్లి రేంజ్లో దాదాపు ఎనిమిది కిలో మీటర్లు, జన్నారం రేంజ్లో ఐదు కిలో మీటర్లు, తాళ్లపేట్ రేంజ్లో నాలుగు కిలో మీటర్ల ప్రధాన రహదారికి ఇరువైపులా కూలీలతో మూడు మీటర్ల మేర ఫైర్లైన్లు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా అకులు, చెత్తను కాల్చివేస్తున్నారు. అంతే కాకుండా వివిధ బీట్లలోకి వెళ్లే రోడ్లకు ఇరువైపులా, అడవీ సమీప గ్రామాలకు వెళ్లే మల్యాల, అల్లీనగర్, దొంగపెల్లి, సింగరాయిపేట, బొమ్మెన గ్రామాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా నేలరాలిన అకులను కాల్చి వేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలకు కాల్చిన బీడీలు, సిగరెట్లను పడవేయవద్దని అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో జరిగే నష్టాలను వివరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో నిప్పును అటవీ ప్రాంతంలో పడవేయరాదని సూచిస్తున్నారు. అటవీశాఖ సిబ్బందితోపాటుగా బేస్ క్యాంప్ సిబ్బంది రోజూ పర్యవేక్షిస్తూ మంటలు చెలరేగకుండా అప్రమత్తంగా ఉంటూ కంటికి రెప్పలా అటవీని, జంతువులను కాపాడుతున్నారు.
భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి..
అటవీ ప్రాంతంలో జల సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. వేసవికాలం ప్రారంభం కావడంతో అటవీ జంతువులు దప్పికను తీర్చేందుకు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా ఈ గుంతల్లో నీటిని నింపుతున్నాం. జంతువులు అక్కడికి చేరుకొని దప్పికను తీర్చుకుంటున్నాయి. ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంల ద్వారా అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాలు, పట్టణాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. భూసారం పెరుగుతుంది. మరోవైపు అడవుల్లో పచ్చదనం పెరుగుతుంది. వన్యప్రాణులకు పుష్కలంగా నీరు అందుబాటులోకి వస్తుంది.
– గణేశ్, ఎఫ్ఆర్వో, నేరడిగొండ, ఆదిలాబాద్ జిల్లా