దండేపల్లి, ఏప్రిల్ 2 : ముస్లింలు పవిత్రంగా.. కఠోర నియమాలతో చేపట్టే రంజాన్ మాసం ఉపవాసాలు ఆదివారం (నేటి నుంచి) ప్రారంభం కానున్నాయి. ఉగాద్వి పర్వదినం శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో అదే రోజు రాత్రి నుంచే ఖురాన్ పఠనం, తరావి నమాజు ప్రారంభిస్తారు. మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్ష చేపట్టనుండగా, నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. ఇప్పటికే నమాజుల కోసం మసీదులను ముస్తాబు చేశారు. వేకువజామున ఉపవాస దీక్ష ప్రారంభించడం కోసం సహర్‌కు..సాయంత్రం దీక్ష (రోజా) విడిచే సమయానికి ఇఫ్తార్‌కు ప్రత్యేక వంటకాలను అందించేందుకు పట్టణాల్లో హోటళ్ల్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ మాసంలో ప్రత్యేకమైన హరీస్, హలీమ్ వంటకాల కోసం ప్రత్యేకమైన దుకాణాలు వెలుస్తాయి. వీటిని ముస్లింలే కాకుండా ఇతర వర్గాల వారు కూడా తినేందుకు ఇష్టపడుతారు. రంజాన్ నెలలో ఇషా నమాజ్ అనంతరం నిర్వహించే తరావి ప్రత్యేక ప్రార్థనలకు జిల్లాలోని మసీదుల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.నెల రోజుల తరువాత ఆకాశంలో షవ్వాల్ నెలవంక కనిపించిన మరుసటి రోజు ఈదుల్ ఫిత్ (రంజాన్)పండుగ జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నది.