నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 : రెండేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న అంతర్జిల్లా దొంగను నిర్మల్ పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మిట్టపెల్లి లక్ష్మణ్ ప్రస్తుతం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ కాలనీలో రూరల్ పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అదేసమయంలో నంబర్ ప్లేట్‌లేని పల్సర్ బైక్‌పై లక్ష్మణ్ భైంసా వైపు నుంచి నిర్మల్‌కు వస్తుండగా ఆపకుండా పారిపోయాడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించడంతో ఫింగర్ ప్రింట్ ఆధారంగా విచారించగా గతంలో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దీంతో విచారించగా మూడేళ్ల క్రితం నిర్మల్, కరీంనగర్, ఆర్మూర్, సిరిసిల్లా జిల్లాలో పగలు, రాత్రి పూట రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడే వాడు. అలాగే జనసంచారం లేని ప్రదేశాల్లో బైక్‌లను దొంగలిస్తూ తప్పించుకొని తిరుతుండేవాడు. నిందితుడి నుంచి 216 గ్రాముల బంగారం, 723 గ్రాముల వెండి 5 పల్సర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్లుగా నిర్మల్‌లో 10 కరీంనగర్లో 3, సిరిసిల్లా, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో ఒక్కోటి చొప్పున మొత్తం 16 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఐదు బైక్‌ల్లో నిర్మల్ జిల్లాలోని మామడ, నర్సాపూర్, ముథోల్, జగిత్యాల్ టౌన్, సిరిసిల్లాలో దొంగలించిన వాహనాలను రికవరీ చేశారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ వెంకటేశ్, ఎస్ఐ వినయ్, ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది జమీర్, నరహరి, ఊశన్న, రమణ, మోహన్, సంతోష్‌ను అభినందించారు.
బైక్ దొంగతనం కేసుల్లో నలుగురు అరెస్ట్ ..
నిర్మల్ జిల్లాలో వాహనాలను దొంగలిస్తున్న నలుగురిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలను అరికట్టేందుకు నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. దీంతో శనివారం మంచిర్యాల్ చౌరస్తా వద్ద ఎస్ఐ వెంకట రమణ వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా.. మొత్తం ఏడు బైకులను దొంగలించినట్లు ఒప్పుకున్నారు. ఈ బైక్‌లను పైడిమడుగు గ్రామానికి చెందిన అంకం వేణుమాధవ్ అతని బావ కిశోర్‌కు అమ్మినాడు.వారి నుంచి రూ.4,50,000 విలువైన ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు ఉండగా, మరో ఇద్దరు ఏ2 ఆదర్శనగర్ కాలనీకి చెందిన కరిపె శివ, నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన ఏ4 నిందితుడు కొమ్రె గంగారాజ్ ప్రస్తుతం సోఫినగర్‌లో నివాసం ఉంటున్నాడు. వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.సమావేశంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ, వెంకటరమణ, సురేశ్, సందీప్, చిన్నయ్య, మన్సూర్ తదితరులు ఉన్నారు.