ఉట్నూర్, ఏప్రిల్ 1: గుస్సాడీలాంటి సంప్రదాయ నృత్యాలను భావి తరాలకు అందించాల్సిన బా ధ్యత మన అందరిపై ఉందని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో పద్మశ్రీ కనక రాజు గుస్సాడీ డ్యాన్స్ పాఠశాలను ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 140 గిరిజన పాఠశాలల విద్యార్థులకు గుస్సాడీ నృత్యం నేర్పిస్తామన్నారు. ఇందుకోసం ఆయనకు గౌరవ వేతనం కింద రూ. 20 వేలు ఇవ్వడంతో పాటు మరో 30 మంది కళాకారులను ఎంపిక చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లాలో ముగిశాక రాష్ట్రంలోని విద్యార్థులకు కూడా నృత్యం నేర్పిస్తామన్నారు. అనంతరం కనక రాజును శాలువాతో సన్మానించి, చీఫ్ డ్యాన్స్ మాస్టర్‌గా నియమిస్తూ పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అంకిత్, పద్మశ్రీ కనక రాజు, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, జిల్లా సర్మేడీ దుర్గు, అటవీ అభివృద్ధి అధికారి రాహుల్, డీడీ సంధ్యారాణి, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజన ఏకో టూరిజం అభివృద్ధికిచర్యలు
ఉట్నూర్, ఏప్రిల్ 1: ఏజెన్సీలోని పురాతన కట్టడాలు, జలపాలతో కూడిన ఏకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని కుంటాల జలపాతం, ఉట్నూర్ కోట, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సప్త గుండాల వాటర్ ఫాల్స్‌తో కూడిన ఏకో టూరిజానికి ప్రభుత్వం రూ. 9.08 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందుకు గాను హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. ఉట్నూర్ పోర్ట్‌పై చరిత్ర తెలుసుకునేందుకు అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ట్రైబల్ విజేజ్కు రూ 3.24 కోట్లు, ఉట్నూర్ ఫోర్ట్‌కు రూ. 3.88 కోట్లు, సప్త గుండాలకు రూ. 1.24 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎఫ్‌డీవో రాహుల్, గిరిజన ఇంజినీరింగ్ ఈఈ భీంరావు, డీటీడీవో సంధ్యారాణి, ఏవో రాంబాబు, ఏపీవో రమణ, పర్యాటక అధికారి రవికుమార్ ఉన్నారు.