లక్ష్మణచాంద, మార్చి 30: ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 2 ఆటోలు, 98 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెండిగ్ చలానాలు కట్టించారు. రూ. 300 విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. యువత గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అమ్మకాలు జరిపినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచిం చారు. గంజాయితో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ద్వారా కలిగే అనర్థాలను వివరించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవా హనాలపై వెళ్లవద్దని సూచించారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100ను ఉపయోగించుకోవాలని సూచించారు. తనిఖీలో సీఐలు రాంనర్సింహరెడ్డి, వెంకటే శ్వర్లు, స్థానిక ఎస్ఐ రాహుల్, ఎస్ఐలు అశోక్, సంతోష్, వినయ్, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
లోకేశ్వరం, మార్చి, 30: గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు తనిఖీలు చేస్తున్నామని ముథోల్ సీఐ వినోద్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరించినా, నిషేధిత వస్తువులు నిల్వ చేసినట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం త్వరలో పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నందున ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాహనాలపై చలాన్లు పెండింగ్ ఉంటే ఈ నెల 31 లోగా చెల్లించి రాయితీ పొందాలని సూచించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 133 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలు, కారు రూ. 1200 విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సాయికుమార్, వివిద పోలీస్స్టేషన్ల నుంచి 50 మంది పోలీసులు పాల్గొన్నారు.