
ఆదిలాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను సర్కారు సవరించింది. మంగళవారం భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు భూముల విలువ పెంచడం, సవరణ చేయలేదు. బహిరంగ మార్కెట్లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం భూముల విలువలు సవరించాలని నిర్ణయించింది. కేబినేట్ సబ్ కమిటీ కూడా భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంచడం విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పెరిగిన ధరలు, చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
చార్జీల పెరుగుదల ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లో వేర్వేరుగా చార్జీలను సవరించారు. గతంలో గజానికి రూ.150 ఉన్న రిజిస్ట్రేషన్ ధర ప్రస్తుతం రూ.50 పెరిగి రూ.200 కానున్నది. రూ.250 ఉన్న పాత ధర రూ.400, రూ.300 ఉన్నవి రూ.500, రూ 350 ఉన్నవి రూ.600, రూ.400 ఉన్నవి రూ.600, రూ.600 ఉన్నవి ప్రస్తుతం 900 పెరుగనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో గజానికి రూ.1,200 ఉన్న ధర రూ.1,750, రూ.3వేలు ఉన్నవి రూ.4,250, రూ.4వేలు ఉన్నవి రూ.5,750, రూ.4,500 ఉన్నవి రూ.6500, రూ.5వేలు ఉన్నవి రూ.7వేలు, రూ.7,500 ఉన్నవి రూ.9,750, రూ. 10వేలు ఉన్నవి రూ.13వేలు, రూ.15వేలు ఉన్నవి రూ.19,500 పెరుగుతాయి. వీటితోపాటు ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.1000 కాంపోజిట్ చార్జీలు ఉంటాయి. గతంలో ఉన్న రూ.1000 ఉన్న కాంపోజిట్ చార్జీలు రూ.1200, రూ.1200 ఉన్నవి రూ.1600కు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.