మంచిర్యాల అర్బన్, జూలై 21 : రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018, ఆగస్టు 15న రైతు బీమా పథకం ప్రారంభించింది. ఈ ఏడాది ఐదో విడుత అమలు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు పంటలకూ అందిస్తూ భరోసానిస్తున్నది. అలాగే ‘రైతు బీమా’ పథకం ద్వారా అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించినా, సహజ మరణమైనా బాధిత రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లిస్తున్నది. 2022, ఆగస్టు 15వ తేదీ నుంచి ఐదో విడుత ప్రారంభం కానుండగా, అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో గతేడాది 1,44,302 మంది పట్టాదారులుండగా, ఈ ఏడాది వారి సంఖ్య 1,52,440కి చేరింది.
1,52,440 మంది పట్టాదారులు..
ఈ ఏడాది జూలై 22వ తేదీ వరకు జిల్లాలో 1,52,440 మంది పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతులు ఉన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. గతేడాది 81,643 (ఎస్సీలు – 17,173, ఎస్టీలు – 6,748, ఇతరులు – 57,722) మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఈ ఏడాది కూడా వీరు రైతు బీమాకు అర్హులుగా గుర్తించారు. 44,553 (మృతి చెందిన రైతులు – 429, ఎన్ఆర్ఐలు – 55, 18 ఏండ్లలోపు వారు – 174, 59 ఏండ్లు దాటిన వారు – 38,909, ఇతర గ్రామాల్లో భూమి ఉన్న వారు – 1,149, ఇతరులు – 3,837) మంది రైతులు అనర్హులుగా గుర్తించారు. 839 మంది ఇంతకు ముందే ైక్లెమ్లు పొందిన వారిలో ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు 1,27,035 మంది పట్టాదారుల సర్వే పూర్తి చేశారు. ఈ ఏడాది కొత్తగా పట్టా పాసు పుస్తకం పొందిన వారు 8,976 మంది రైతులు ఉండగా, గతేడాది వివరాలు అందజేయని రైతులు 16,429 మంది ఉన్నారు. మొత్తం 25,405 మంది రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు చేసుకుంటే సదరు రైతుల వివరాలు ఆన్లైన్ చేసేందుకు వ్యవసాయాధికారులు సిద్ధంగా ఉన్నారు.
నెలాఖరులోగా దరఖాస్తుకు అవకాశం..
జిల్లా వ్యవసాయాధికారి కల్పన ఆధ్వర్యంలో నలుగురు ఏడీఏలు, 18 మండలాల ఏవోలు, 52 మంది ఏఈవోలు సర్వే నిర్వహించారు. ఆయా మండలాలు, గ్రామాల్లోని రైతుబంధు సమితి సభ్యుల సహకారంతో ప్రతి రైతు వివరాలు సర్వే చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా ఇప్పటి వరకు జిల్లాలో 1,27,035 మంది రైతుల పట్టా పాసుపుస్తకాల ఆధారంగా సర్వే నిర్వహించారు. వీరిలో 81,643 మంది రైతులను అర్హులుగా గుర్తించి వారి పాత ఎల్ఐసీ ఐడీలతో వారి వివరాలు ఆన్లైన్ చేశారు. గతంలో దరఖాస్తు చేసుకోని పట్టాదారులు, నూతన పట్టాదారులు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటే సర్వే చేసి ఆన్లైన్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు.
పట్టాదారే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి
జూన్ 22వ తేదీలోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులు ఈ నెల 30వ తేదీలోగా ఏవో కార్యాలయంలో పట్టాదారే స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలి. రైతుబీమా చేయించుకున్న రైతుల ఆధారు కార్డులలో ఏమైనా మార్పులున్నా, నామిని వివరాలు మార్చాలనుకున్నా నేడు (ఈ నెల 22వ తేదీ) క్లస్టర్ ఏఈవోను సంప్రదించాలి. నూతనంగా దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారు పాసుబుక్, పట్టాదారు ఆధార్, నామినీ ఆధార్, రైతుబీమా ఫారంతో దరఖాస్తు చేసుకోవాలి. పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా పరిశీలన ఉంటుంది. ఈ మంచి పథకాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– కల్పన, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల
జిల్లాలో పట్టాదారు రైతుల సంఖ్య 1,52,440
రైతు బీమాకు అర్హులు 81,643
రైతు బీమాకు అనర్హులు 44,553
ైక్లెయిమ్లు పొందిన వారు 839
దరఖాస్తు చేయని రైతుల సంఖ్య 18 ఏండ్లలోపు ఉన్న రైతులు 174
59 ఏండ్లపైబడిన వారు 38,909
చనిపోయిన వారు 429
అందుబాటులో లేని వారు /ఎన్ఆర్ఐ 55
ఇతర గ్రామాల్లో భూమి ఉన్న వారు, ఇతరులు 4,986