కార్మిక చట్టాలను బలహీనపర్చేందుకే లేబర్ కోడ్లు
అసంఘటిత కార్మికులపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి నష్టం
ఆగ్రహించిన కార్మిక సంఘాల జేఏసీ
నేడు, రేపు సార్వత్రిక సమ్మె
నిర్మల్ టౌన్, మార్చి 27;కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మికుల హక్కులపై కుట్ర పన్నుతున్నది. రాజ్యాంగంలో వారి కోసం రూపొందించిన చట్టాలను కాలరాస్తున్నది. 44 చట్టాలను బలహీనపరిచి.. 4 లేబర్ కోడ్లుగా సవరణచేస్తూ నిర్ణయించింది. పైగా వెంటనే అమల్లోకి తీసుకురావాలని వివిధ రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నది. దీని వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధానంగా 2 లక్షల మంది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఆగ్రహించిన కార్మిక సంఘాల జేఏసీ.. సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సంఘీభావంతో ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఝలక్ ఇస్తున్నది. 44 కార్మిక చట్టాలను 4 వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, ఆరోగ్య భద్రత కోడ్లుగా విభిజించింది. వీటి వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నట్లు కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు సింగరేణి, ఆర్టీసీ, మున్సిపల్, మధ్యాహ్న భోజన, విద్యుత్ తదితర శాఖల్లో పనిచేసే 2 లక్షల కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నది.
నాలుగు కోడ్లతో కష్టాలు..
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ పరిశ్రమలను ప్రైవేటీకరించడమే కాకుండా యజమాన్యాలకు కార్మికులపై ఉన్న హక్కులను తొలగించేలా కుట్రలు పన్నుతున్నది. గతంలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు అవసరమైతే సమ్మె, నిరసన చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు దాన్ని 60 రోజులకు పెంచింది. అది కూడా యజమాని సమ్మతిస్తేనే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో 10 మంది సభ్యులుంటే కార్మిక సంఘంగా గుర్తింపు ఉండేది. దాన్ని 20 మందికి పెంచారు. ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికుల్లో 51 శాతం కార్మిక సంఘాల కార్మికులు ఉంటేనే ఆ సంఘానికి గుర్తింపు ఉంటుంది. అంటే తక్కువ సంఖ్యలో ఉన్న కార్మికులకు ఆ పరిశ్రమలో ఇక నుంచి కార్మిక సంఘం గుర్తింపు దక్కే అవకాశం లేదు. దీని వల్ల యాజమాన్యాలు కార్మికులపై వివక్ష ప్రదర్శిస్తే అవకాశం ఉంది. దీనికి తోడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రోజుకు 8 గంటల పని మాత్రమే కల్పించాలి.
ఇప్పుడు 12 గంటల వరకు పని కల్పించేందుకు యజమాన్యాలకు అవకాశం ఇవ్వనున్నారు. దీనివల్ల రెండు షిప్టుల్లోనే పనిచేయాల్సి రావడంతో ఉపాధి లేకుండా పోతుందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. పని స్థలంలో కార్మికుడు ప్రమాదానికి గురైతే ఆ బాధ్యత యజమాన్యమే భరించాల్సి ఉండేది. ఇప్పుడు విచారణలో లేబర్ బాధ్యుడిగా తేలితే అతనికి రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధించే వెసులుబాటు కల్పించడంతో కార్మికులకు ఇది మింగుడుపడలేదు. గతంలో తమ అవసరాల కోసం అదనంగా పనిచేస్తే ఓటీ రూపంలో వేతనం వచ్చేది. దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. పరిశ్రమలు ఆర్థిక దివాలా తీసినప్పుడు కార్మికులతో సంప్రదింపులు జరిపి, కంపెనీని మూసివేసే అవకాశం ఉండేది. ఇప్పుడు కార్మికులతో సంబంధం లేకుండానే లాకౌట్ ప్రకటించే అవకాశం కల్పించారు. ఇలా ఏ అంశంలో చూసినా కార్మికులపై కొత్త లేబర్ కోడ్ చట్టాలు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో నెల రోజుల పాటు పనిచేస్తే ఒకటోతేదీన వేతనాలు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పుడు పది రోజుల గడువు విధించినట్టు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు ఆహారభద్రత, సామాజిక భద్రతపై కూడా యాజమాన్యాలు కార్మికులపై వివక్ష చూపేందుకు ఈ చట్టాలు బలహీనం చేయడంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగనున్నది.
నేడు, రేపు కార్మిక సంఘాల పోరుబాట..
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలో ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ, బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ, బీడీ, సింగరేణి కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ తదితర సంఘలన్నీ సమ్మెలో పాల్గొననున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సంఘీభావంతో ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. దీంతో పూర్తిగా బ్యాంకులు, పరిశ్రమలు మూతపడనున్నాయి. తమ హక్కులను కాలరాసే కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నాయి. ఈ సార్వత్రిక సమ్మెకు యజమానులు కూడా సహకరించాలని వారు కోరుతున్నారు.
కేంద్రం వైఖరిని ఎండగడుతాం..
కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమ, మంగళవారాల్లో సమ్మె నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున కార్మికులతో కలిసి ధర్నాలు, ర్యాలీలు తీస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో బీడీ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతాం.
– రాజన్న, జిల్లా కార్యదర్శి, ఐఎఫ్టీయూ
బతుకుడెట్లా..
చిన్నప్పటి నుంచి బీడీలు చుట్టడం తప్ప మాకు ఏ పనీ రాదు. నెలంతా కష్టపడితే రూ.2 వేలు వస్తుంది. కేసీఆర్ సార్ మాకు నెలకు రూ.2,016 పింఛన్ ఇస్తున్నారు. దీంతో రూ.4వేలతో మా కుటుంబ అవసరాలు తీరుతున్నయ్. బీడీ కార్మికులకు నెలలో 20 రోజులు పని దొరకడం లేదు. బీడీలు బంద్ అని చెప్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులపై ఇంత అన్యాయం చేస్తే మేము బతికేది ఎట్లా.
–గజ్జవ్వ, బీడీ కార్మికురాలు, కుభీర్