32 గ్రామ పంచాయతీల్లో షెడ్లు పూర్తి
మల్టీపర్పస్ వర్కర్లకు పెరిగిన వేతనాలు
అవగాహన కల్పిస్తున్న అధికారులు
ఎరువుల తయారీపై పంచాయతీల ఆసక్తి
ఇచ్చోడ, మార్చి 27 : పల్లె ప్రగతి పథకాన్ని పంచాయతీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. కంపోస్టు షెడ్ల నిర్మాణాలతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. వచ్చిన ఆదాయంతో గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతన్నాయి. ఇచ్చోడ మండలంలో 32 గ్రామ పంచాయతీల్లో కంపోస్టు షెడ్లను ఏర్పాటు చేసి, సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ముక్రా(కే)లో సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో 2020 జూలైలో సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పుడు 37 క్వింటాళ్లు విక్రయించడంతో రూ.75వేల ఆదాయం వచ్చింది. ఇతర గ్రామ పంచాయతీలు కూడా ఇదే మార్గంలో పయనిస్తూ ఆదాయమార్గాలను సమకూర్చుకుంటున్నాయి. ఒక వైపు గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరడమే కాకుండా, మరోవైపు ఇందులో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రూ. 8500 వేతనం అందిస్తున్నది.
కిలోకు రూ.5 నుంచి 10 విక్రయం
కంపోస్టు షెడ్లలో తయారు చేసిన ఎరువును రైతులతో పాటు ఎవెన్యూప్లాంటేషన్, హరితహారం కోసం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఒక కిలోకు రూ.5 నుంచి 10 వరకు విక్రయిస్తున్నారు. ముక్రా(కే)లో 50 కిలోల బస్తాను రూ.1000కి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను సేకరించేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్లర్లతో పాటు ట్రాలీలను కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్తను ముందుగా వేరు చేస్తారు. కాగా తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేస్తూ, పొడి వ్యర్థాలను బల్క్‌గా విక్రయిస్తూ పంచాయతీలు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి.
లక్ష్యం నెరవేరుతోంది
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా సేకరించిన చెత్తతో అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. మండలంలో అన్ని గ్రామాల్లో కంపోస్టు షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మొదట ముక్రా(కే)లో సేంద్రియ ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాం. విజయవంతం కావడంతో ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో తడి, పొడి వ్యర్థాలతో ఎరువుల తయారీని మండల వ్యాప్తంగా విస్తరించాం.
–వామనభట్ల రాంప్రసాద్, ఎంపీడీవో, ఇచ్చోడ