క్వింటాల్‌కు రూ.5230 మార్కెట్లో రూ.4500
రైతులను ఆదుకుంటున్న సర్కారు
బోథ్, మార్చి 27 : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసిన శనగ మంచి ధర పలుకుతున్నది. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. క్వింటాల్‌కు రూ. 5230 చెల్లిస్తున్నది. బోథ్ మండలంలో యాసంగి సాగులో రైతులు 14,035 ఎకరాల్లో శనగ సాగు చేశారు. సోయా పంట పూర్తయ్యాక ఆ పొలాల్లో రైతుల శనగ వేశారు. మరికొంత మంది రైతులు పత్తిని తొలగించి శనగ వేసుకున్నారు. నవంబర్ చివరి వారం నుంచి పంట సాగు ప్రారంభం కాగా, ఈ నెల మూడోవారం వరకు పంట చేతికి వచ్చింది. అకాల వర్షాలు, పొగ మంచు, తదితర వాతావరణ పరిస్థితుల మూలంగా దిగుబడి సరాసరి 6 నుంచి 9 క్వింటాళ్ల వరకు వచ్చింది. పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 4500 నుంచి రూ. 4700 వరకు ధర పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందారు. ప్రభుత్వం నాఫెడ్ సౌజన్యంతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సహకార సంఘాలను సమన్వయం చేసుకొని మద్దతు ధర రూ. 5230 చెల్లించి కొనుగోలు చేయిస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో పంట సాగు వివరాలు నమోదు చేసుకున్న రైతుల నుంచి ఎకరానికి 6.7 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ మేరకు కొనుగోలు చేస్తున్నారు. బయటి మార్కెట్‌తో పోల్చుకుంటే ధర క్వింటాల్‌కు రూ. 500 నుంచి రూ. 700 వరకు నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంట పండించినా టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్లస్టర్ల వారీగా కొనుగోలు చేస్తున్నాం
బోథ్, నేరడిగొండ మండలాల్లోని వ్యవసాయ క్లస్టర్ల వారీగా శనగలు కొనుగోలు చేస్తున్నాం. ఆన్లైన్లో పంట సాగు వివరాలు నమోదై ఉన్న రైతుల శనగలు ఎకరాకు 6.7 క్వింటాళ్ల చొప్పున తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ గ్రామాల వారీగా తేదీలు ఖరారు చేశాం. ఆ ప్రకారమే రైతులు పంట అమ్మకానికి తీసుకువచ్చి సహకరించాలి.
–బారె భూషణ్, సీఈవో, కేంద్రం ఇన్చార్జి