బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే మన వద్దే వేతనాలు అధికం
రూ.1500 వేతనం రూ.9,750 పెరుగుదల
ఏడేండ్లలో రూ.8,250 పెంచిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదే..
స్మార్ట్‌ఫోన్స్ అందజేత.. పని సులువు..
కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్న ఆశ కార్యకర్తలు
నిర్మల్ టౌన్, మార్చి 26 : ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆర్థికంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది. ఈ ఆర్యోక్తిని నిజం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఆరోగ్య తెలంగాణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. దీనికి తోడు పరికరాలు, అవసరమైన వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు. వీరితో సమానంగా ఆశ కార్యకర్తలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ ఏడేండ్ల కాలంలో దాదాపు వంద మందిని నియమించి.. వేతనాన్ని రూ.8,250 పెంచారు. వారు పని సులువు చేయడం కోసం స్మార్ట్‌ఫోన్స్ కూడా అందించారు. సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఆశ కార్యకర్తలు జేజేలు పలుకుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,920 మంది ఆశ కార్యకర్తలుండగా.. ఇందులో నిర్మల్‌లో 568, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 753, ఆదిలాబాద్‌లో 1,006, మంచిర్యాలలో 663 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఉమ్మడి జిల్లాలోని 78 పీహెచ్‌సీల పరిధిలో క్లస్టర్లవారీగా పని చేస్తున్నారు. వీరు బాలింతలు, చిన్నపిల్లలకు టీకాలు, గర్భిణులకు ప్రసవాలు, వృద్ధులకు బీపీ, షుగర్, దీర్ఘకాలిక రోగాలపై సర్వే నిర్వహించి అవసరమైన చికిత్స అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వీటికితోడు ఇంటింటికీ సర్వే, హెల్త్ ప్రొఫైల్ కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్య పథకాలను అమలు చేయడంతో ఆశలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫలితంగా ఆదివాసీ గూడేల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. ఆరోగ్య అవసరాలను తీర్చడంలో వైద్యులతో సమానంగా పనిచేస్తుండడంతో రాష్ట్ర సర్కారు సౌకర్యాలు కల్పిస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే అధిక వేతనం..
ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలకు బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే అధిక వేతనాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో రూ.5వేల నుంచి రూ.6 వేలలోపే జీతాలు ఇస్తున్నారు. తెలంగాణలో రూ.9,750 చెల్లిస్తుండడంతో ఆ రాష్ట్రాల కంటే 30 శాతం వేతనం అధికంగా చెల్లిస్తున్నది. 2014లో పనితీరు ప్రామాణికంగా రూ.1500-రూ.3వేల వరకు వేతనం రాగా.. 2016లో రూ.5 వేలు-రూ.6వేలు, 2018లో రూ.7వేల నుంచి రూ.7,500, ప్రస్తుతం రూ.9,750కి పెంచడంతో ఆశ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ ఏడేండ్ల కాలంలో రూ.8,250 పెరిగాయి.
తెలంగాణ ప్రభుత్వంలోనే గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశ కార్యకర్తలకు గుర్తింపు వచ్చింది. ఏడేండ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో వంద మంది ఎంపికైనట్లు ఆరోగ్య సిబ్బందిని నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు ఆన్లైన్ రిపోర్టు అందించేందుకు 1000 మందికి స్మార్ట్‌ఫోన్స్ అందించారు. ఒకవైపు వేతనాలు పెంచడం, మరోవైపు స్మార్ట్‌ఫోన్స్ అందించి సాంకేతికను వినియోగించేందుకు అవకాశం కలిగించడంతో సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా.. కరోనా మహమ్మారిలో వీరి సేవలు అమోఘంగా ఉన్నాయి.
స్వరాష్ట్రంలోనే వేతనాలు పెరిగాయి..
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వేతనాలు భారీగా పెరిగాయి. 2006 సంవత్సరం నుంచే ఆశ కార్యకర్తల నియామకం ప్రారంభమైంది. అప్పుడు రూ.400 వేతనం మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రూ.1500 నుంచి రూ.3 వేలే వచ్చేవి. సీఎం కేసీఆర్ అయ్యాక క్రమంగా వేతనాలు పెంచారు. ఇప్పుడు రూ.9,750 వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు జీతాలు పెంచారు. ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. వేతనాలు కూడా అలాగే వస్తున్నాయి.
– చంద్రకళ, ఆశ కార్యకర్తల సంఘం, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు
స్మార్ట్ఫోన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే..
2016 సంవత్సరం నుంచి పనిచే స్తున్నా. 24 గంటలు రాత్రనక, పగలనకా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నం. రిపోర్టులు రాసుకొని ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నాం. ఇదీ కొంచెం ఇబ్బందిగా మారడం, నివేదికలు సరైన సమయానికి లభించికపోవడం వంటి వాటితో సర్కారు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నది. ఇప్పుడు రిపోర్టులు తయారు చేయడం సులువవుతుంది. ఆశలకు సమూచిత గౌరవం దక్కుతున్నది.
– విజయలక్ష్మి, ఆశ కార్యకర్త, రాచాపూర్.
ఆశలతోనే ఆరోగ్యం మెరుగు..
ఆరోగ్య పథకాలు అమలు చేయడంలో ఆశ కార్యకర్తలు కీలకభూమిక పోషిస్తున్నారు. పిల్లలు, గర్భిణులకు టీకాలు ఇప్పించడం, గర్భిణులను దవాఖానకు తీసుకెళ్లడం, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లడం చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో రోగాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. వైద్యుల కంటే ఆశ కార్యకర్తలే ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల ఆరోగ్య ఫలితాలు వస్తున్నాయి.
– శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ఉప వైద్యాధికారి