బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్
ఎంపీటీసీలతో తీర్మానం
బోథ్, మార్చి 26 : రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీటీసీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పంజాబ్ తరహాలో వందశాతం ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయానికి తీర్మానం ప్రతిని పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మారిపోయిందన్నారు. పట్టెడన్నం పెట్టే రైతన్నల నడ్డివిరిచే విధంగా కేంద్రప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ రాథోడ్ లింబాజీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అన్ని జీపీల్లో తీర్మానాలు చేయాలి
ఇచ్చోడ, మార్చి 26: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపడం సరికాదని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలన్నారు. తీర్మానాల పత్రాలు ఆదివారం తనకు సంబంధిత సర్పంచ్‌లు అందించాలన్నారు. ఈ పత్రాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పోస్టు ద్వారా పంపనున్నట్లు ఆయన వివరించారు.
బేల, మార్చి 26 : రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీర్మానాలు చేశారు. తీర్మాన పత్రాలు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, నాయకులు సతీష్ పవార్, తదితరులు పాల్గొన్నారు.