
హాజీపూర్, జూలై 20 : జిల్లాలో భూములు, లేఅవుట్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధం గా చేపట్టాలని పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పురపాలక పరిపాలక సంచాలకుడు సత్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో లేఅవుట్, అడిట్, హరితహారం, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.అక్రమలే అవుట్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం – 2019 వచ్చిన తర్వాత ప్రారంభించిన లే-అవుట్ వివరాలు, ప్రతి మున్సిపాలిటీకి రెండు కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉన్న లే ఔట్ల వివరాలు సేకరించి జిల్లా వ్యాప్తంగా లేఅవుట్లలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. నిబంధనల మేరకు లే ఔట్లలో 10 శాతం ఓపెన్ స్థలం స్థానిక సంస్థల పేరిట రిజిస్టరు చేయకపోతే యజమానులకు జరిమానా విధించాలన్నారు. లేఅవుట్ అనుమతులు జిల్లా స్థాయిలో ఉండే కమిటీ మాత్రమే జారీ చేస్తుందన్నారు. రిజిస్టర్ చేసిన భూమిలో బోర్డు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలను నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో పూర్తి కానున్న సమీకృత కలెక్టరేట్ ప్రాంగణాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలన్నారు.
ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రతి ఆస్తి వివరాలు నమోదు చేయడంతో పాటు భూములు, భవనాలు, వాహనాలు, కార్యాలయ సామగ్రి వంటి అన్ని వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని సూచించారు. పారదర్శకంగా భవనాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం టీ-బీపాస్ ప్రవేశ పెట్టిందన్నారు. దీని ద్వారా 75 గజాల వరకు అనుమతి అవసరం లేదని, 75 నుంచి 600 గజాల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లో అనుమతులు అందిస్తున్నామన్నారు. అనుమతి పొందిన సమయంలో సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణం చేపట్టారో లేదో పరిశీలించాలన్నారు. వ్యత్యాసం ఉన్నట్లయితే చట్ట ప్రకారం సదరు నిర్మాణం తొలగించడం, లేదా జరిమానా విధిస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణను మెరుగు పర్చుకోవాలన్నారు. నివాసాలపై నుంచి వెళ్లే హై-టెన్షన్ వైర్లను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠధామం, పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. 2 నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్లో ల్యాండిగ్ పూలింగ్ విధానం అత్యంత ప్రాముఖ్యత పొందుతుందన్నారు. ఈ విధానం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశం పై త్వరలోనే జిల్లా స్థాయిలో అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.