పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ
నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్
జిల్లాలో మూడు చోట్ల అర్హత పరీక్ష
పెద్ద సంఖ్యలో హాజరైన యువత
నిర్మల్ అర్బన్, మార్చి 26 : యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణకు జిల్లా కేంద్రంలోని దివ్యా గార్డెన్లో శనివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రణాళికప్రకారం చదివి ఉద్యోగాలు సాధించుకోవాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులు, మోసగాళ్ల మాటలు నమ్మి విలువైన కాలాన్ని, ధనాన్ని ఉద్యోగాన్ని కోల్పోవద్దని సూచించారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్‌లో అర్హత పరీక్ష నిర్వహించామని చెప్పారు. మొత్తం 2466 మంది నిరుద్యోగులు అర్హత పరీక్షకు హాజరయ్యారైనట్లు వెల్లడించారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో దేహధారుడ్య పరీక్షలు త్వరలో నిర్వహించి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లా నుంచి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
అర్హత పరీక్షకు విశేష స్పందన
భైంసాటౌన్, మార్చి 26 : పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కోసం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భైంసాలో నిరుద్యోగ యువతకు శనివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు యువత నుంచి విశేష స్పందన లభించింది. భైంసా పట్టణ శివారులోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో అర్హత పరీక్ష నిర్వహించారు. భైంసా డివిజన్ పరిధిలో 740 మంది నిరుద్యోగులు పరీక్షకు హాజరయ్యారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పరీక్షా హాలులో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచారు. డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు ఇన్విజిలెటర్లుగా వ్యవహారించారు. భైంసా టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, ముథోల్ సీఐ వినోద్, పోలీసులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, మార్చి 26 : పట్టణంలోని ఏఏంకే ఫంక్షన్ ప్యాలెస్‌లో నిరుద్యోగ యువతకు శనివారం అర్హత పరీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల యువత పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన యువతకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నుట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ అజయ్‌బాబు, ఎప్ఐ రజినీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.