గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
హాజీపూర్, మార్చి 25 : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వార జిల్లా కలెక్టర్, విద్యాశాఖ, వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు- మన బడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, తదితర నిర్మాణాలు చేపట్టాలన్నారు. పనుల అంచనాలను సిద్ధం చేసి, ప్రతిపాదనలను సిద్ధం చేసి ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ భారతీ హోళికేరి జిల్లా అదికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకానికి మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని ఉపాధి హామీ పథకంలో పాఠశాలల్లో వంట శాలలు, ప్రహరీ, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులపై క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ఎంపికైన ప్రతి పాఠశాలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో..
ఆసిఫాబాద్,మార్చి25 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరి నిర్మాణం, తదితర పనులను చేపట్టాలన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రజా ప్రతనిధులు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, డీఈవో అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.