కొండాపూర్ బ్రిడ్జి పనులు ప్రారంభం
రాంపూర్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు
సిరికొండకు సులువుగా ప్రయాణం
మారుమూల గ్రామాలకు తగ్గనున్న దూరం
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
సిరికొండ, మార్చి 25 : మండలంలోని రాంపూర్, మల్లాపూర్, పొచ్చంపల్లి, కన్నాపూర్ గ్రామాల రైతులు ఏటా వానకాలంలో సిరికొండకు వెళ్లాలన్నా, ఇతర గ్రామాలకు ప్రయాణాలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. చిన్నపాటి వర్షం కురిసినా కొండాపూర్ బ్రిడ్జి తెగిపోవడంతో పొచ్చంపల్లి, కన్నాపూర్ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఇంద్రవెల్లి మండలం మీదుగా సిరికొండకు 20 కిలోమీటర్లు అదనంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గతంలో బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, రేఖానాయక్, ఎంపీ సోయం బాపురావ్కు విన్నవించగా స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు.
రాంపూర్ వంతెనకు రూ.1.52 కోట్లు
మండలంలోని మల్లాపూర్, రాంపూర్ పంచాయతీల పరిధిలోని ప్రజలు మండల కేంద్రానికి అత్యవసర పనులు, కార్యాలయాలకు వెళ్లాలంటే చిక్మాన్ వాగు దాటి ప్రయాణించాల్సి వచ్చేది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వానకాలం ఆరు నెలల వరకు రాకపోకలు బంద్ అయ్యేవి. మండల కేంద్రం నుంచి అత్యవసర పనులపై పోలీసు, వైద్య సిబ్బంది. గ్రామాలకు వెళ్లాలంటే ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సిన పరిస్థితి. రాంపూర్ బ్రిడ్జి పూర్తయితే మండల కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామాలు ఉన్నాయి. బ్రిడ్జిటెండర్ పూర్తి కావడంతో దూరభారం తగ్గుతుందని ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇంద్రవెల్లి- సిరికొండకు బీటీ రోడ్డు పనులు ప్రారంభం
సిరికొండ నుంచి ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ వరకు రూ.2 కోట్లతో రాష్ట్ర, కేంద్ర నిధులతో పంచాయతీ రాజ్ అధికారులు బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో సిరికొండ నుంచి ఇంద్రవెల్లి మండలానికి వెళ్లడానికి అధికారులు, ప్రజలు, వాహనదారులకు దూరభారం తగ్గుతుంది.
ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం
బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, రేఖానాయక్ ఇచ్చిన మాట ప్రకారం రాంపూర్, కొండాపూర్ బ్రిడ్జిలతో పాటు రూ.2 కోట్లు బీటీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేసినందుకు గిరిజన ప్రజలందరం రుణపడి ఉంటాం. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
–సట్ల విజయ్,లక్ష్మీపూర్ గ్రామస్తుడు