మొదటి బహుమతి రూ.లక్ష
ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు సాయిని రవికుమార్
ఆదిలాబాద్ రూరల్, మార్చి 25 : ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో సీనియర్ క్రీడాకారుడు స్వర్గీయ సాయి తేజ స్మారక కబడ్డీ, ఓపెన్ టూ ఆల్ కబడీ టోర్మమెంట్ను ఏప్రిల్ 9 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు సాయిని రవికుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మాస్టర్మైండ్స్ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల మరణించిన సాయితేజ జ్ఞాపకార్థం ఈ అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ప్రతిభ కలిగిన జట్లను పోటీల్లో పాల్గొనడానికి అనుమతిస్తామన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయ స్థానం రూ.50 వేలు, తృతీయ స్థానం రూ.25 వేలు, నాలుగో స్థానంలోని వారికి రూ.10వేలు, తర్వాత 4స్థానాల్లో నిలిచిన జట్లకు ట్రోఫీలతో పాటు రూ.5 వేల చొప్పున బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే జట్లు 99499 90278, 98660 81088, 99485 80976, 63055 81572, 63050 76205 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లా కబడ్డీ సంఘం కోశాధికారి పీ అజయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మజర్, సంయుక్త కార్యదర్శులు బారె శ్రీధర్, గణేశ్, నవీన్, కృష్ణ పాల్గొన్నారు.