పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యా బోధన
గర్భిణులు, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం అందజేత
సద్వినియోగం చేసుకుంటున్న లబ్ధిదారులు
ఇచ్చోడ, మార్చి 23 : అంగన్వాడీలు.. ప్రేమకు, రక్షణకు నిలయాలు. ముద్దు, మురిపాలతో నిండిన భద్రతకు ప్రతిరూపాలు. ఆకలేసినప్పుడు అన్నం తినిపించేది, ఆటలాడించి లాలించేది.. బుద్ధులు నేర్పేది.. ఓనమాలు దిద్దించేవి అవే. ఒకప్పుడు ఆదరణకు నోచుకోని కేంద్రాలు.. ఇవే సర్వం అయిపోయాయి. వీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఆరోగ్యం మన ముంగిట నిలుస్తుంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇలా అందరికీ అమ్మబడిగా నిలుస్తూ.. బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నాయి. పిల్లలకు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సలహాలు, సూచనలిస్తున్నారు. కేంద్రాలు చిన్నవే అయినా అందించే సేవలు మాత్రం అమోఘం. మనిషి ఆరోగ్యకర జీవనానికి బాటలు వేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) పరిధిలో ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, సిరికొండ మండలాలు ఉండగా.. మొత్తం 12 ఐసీడీఎస్ సెక్టార్లున్నాయి. వీటి పరిధిలో 241 ప్రధాన అంగన్వాడీ, 47 మినీ అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. కరోనా ప్రభావంతో సుమారు 18 నెలలపాటు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటికే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా ప్రభావం ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ కేంద్రాలను తెరిచారు.
ఉపయోగాలు అధికం..
పేర్లు నమోదు చేసుకున్న వారు కేంద్రాలకు వస్తే ఆరోగ్య అంశాలే కాకుండా ఇతర విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. బోథ్ పరిధిలో మొత్తం 45 అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల(కిచెన్ గార్డెన్లు)ను పెంచుతున్నారు. ఆరోగ్య లబ్ధి పథకంలో భా గంగా ఉడికించిన గుడ్డు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, భోజనం, పాలు, ఐఎన్ఏ (ఐరన్ మాత్ర లు) ఇస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య స్థితిని బట్టి కౌ న్సెలింగ్ ఇస్తూ పాటించాల్సిన అంశాలపై సూచన లు, సలహాలు అందిస్తున్నారు. ఇది సురక్షిత ప్రసవానికి దోహదపడుతున్నది. బిడ్డపుట్టాక తల్లి పాలు పట్టే విధానం, సమస్యలు, సందేహాల నివృత్తి వంటి వాటిపై సమగ్రంగా వివరించి చెబుతున్నారు. ప్రతినెలా బరువు చూడడం, ఇతర ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
ఆటపాటలతో చదువులు..
చిన్నారులకు అమ్మ ప్రేమను పంచుతూ ఆటపాటలతో అక్షరాలు నేర్పిస్తున్నారు. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా 3-4 ఏళ్ల పిల్లలకు ఎల్కేజీ, 5-6 ఏళ్ల చిన్నారులకు యూకేజీ పుస్తకాలు, పాలపిట్ట, రెయిన్బో పేర్లతో ముద్రించి అందిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల భాష పరిచయం, గణితం, ‘నేను-నా పరికరాలు’ పేరుతో తయారు చేసిన తెలుగు, ఆంగ్లం వర్క్ పుస్తకాలను చిన్నారులకు అందజేస్తున్నారు. వీటిని అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యతోపాటు ఉదయం పాలు, ఉడికించిన గుడ్లు, మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నారు. పవర్ గ్రిడ్ సంస్థ ఆధ్వర్యంలో 0-3 లోపు చిన్నారులకు కొర్రలు, జొన్న రవ్వ, రాగి పిండి, పల్లిపట్టీలు, పల్లీలు, బెల్లం, ఇప్పపువ్వు లడ్డూలను అందిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు.
ఉదయం కూడా..
కేంద్రాల్లో భోజనం మధ్యాహ్నమే కాదు.. లబ్ధిదారులందరూ కోరితే ఉదయం కూడా వండిపెట్టే వెసులుబాటు ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఎవరూ కోరడం లేదు. గ్రామాల్లో కొందరు ఉదయమే పనులకు వెళ్తుంటారు. మధ్యాహ్నం వచ్చేందుకు అవకాశం ఉండదు. ఇలాంటి వారు కేంద్రాల్లో ఏఎల్ఎంఎస్సీ కమిటీని సంప్రదించి ఉదయమే తమకు భోజనం వండించేలా చూడాలని కోరవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న సరుకులను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రాల్లో అందించే సేవల వివరాలతో కూడిన గోడ ప్రతులను అన్ని చోట్ల ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ తీసుకునే పోషకాహార పరిమాణం, ఆరోగ్య సేవలు, కౌన్సెలింగ్ తదితర వివరాలను పొందుపర్చాం. లబ్ధిదారులందరూ కేంద్రాలకు వచ్చేలా అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు ప్రోత్సహిస్తున్నారు. ప్రతినెలా సెక్టార్ సమావేశాలను నిర్వహిస్తున్నాం. కేంద్రాలపై నిర్లక్ష్యం చేసే అంగన్వాడీ టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– పూస ఉమారాణి, గ్రేడ్-1 సూపర్వైజర్, ఇచ్చోడ