ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్
పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా
ఖానాపూర్ టౌన్, మార్చి 23 : కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లపై మొండి వైఖరి వీడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారుకు నిరసనగా పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం ఎస్సీ, ఎస్టీ నాయకులతో కలిసి ఆమె ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంట్‌కు పంపించిందన్నారు. కానీ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వం పంపించలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ భరతం పట్టేందుకు సీఎం కేసీఆర్ యుద్ధం మొదలైందని, హక్కులను సాధించేందుకు తెలంగాణ గిరిజనులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు సాధించి తీరుతాం : ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఉట్నూర్, మార్చి 23 : గిరిజనుల రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ స్పష్టం చేశారు. ఆయన నివాసంలో బుధవారం ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్లను పెంపునకు శాసనసభలో తీర్మానించి పత్రాలను పార్లమెంట్‌కు పంపితే తమకు రాలేదని కేంద్ర మంత్రులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గిరిజన రిజర్వేషన్ పెంపు బిల్లును అమోదించాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ కృషిచేయాలన్నారు. మాజీ సర్పంచ్ మర్సకోల తిరుపతి, నాయకులు మహేందర్, చంద్రశేఖర్, రమేశ్, అశోక్, రవీందర్ పాల్గొన్నారు.