ఎదులాపురం, మార్చి23 : టీబీ వ్యాధిగ్రాస్తులను గుర్తించి వారికి వెంటనే వైద్యం అందించడంలో ఆదిలాబాద్ జిల్లా నంబర్ వన్‌లో ఉందని ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్రాజ్తో కలిసి బుధవారం మాట్లాడారు. 2023 వరకు టీబీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో టీబీ కేసులు గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఐదో స్థానంలో ఉందని, ఈ ఏడాది మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 807 మంది టీబీ బాధితులు ఉన్నారని వివరించారు. వారందరికీ ప్రతి నెల రూ.500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల వారికి రవాణా చార్జీలు అదనంగా రూ.750 ఒకే సారి ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే రెండోదైన లిక్విడ్ కల్చర్ మిషన్ రిమ్స్‌లో అందుబాటులో ఉందన్నారు. రెండు వారాలకు పైగా తెమడతో కూడిన ఎడతెరిపిలేని దగ్గు, సాయంత్రం పూట జ్వరం పెరగడం, రాత్రి సమయంలో చెమటతో కూడిన జ్వరం , ఛాతిలో నొప్పి, ఆకలి మందగించడం ,బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్‌రాజ్ సూచించారు. బాధతులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిచండంతో పాటు సమీప వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచిర్యాలీ ఉంటుందన్నారు. సమావేశంలో టీడీసీ కో ఆర్టినేటర్ చెన్నమల్లయ్య, సిబ్బంది నవీద్, ప్రమోద్ కుమార్ ఉన్నారు.