ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం
ఐదురోజుల పాటు ట్రైనింగ్
ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించాలనే లక్ష్యంతో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా హైస్కూల్ స్థాయిలో సుమారు 52 మంది ఉపాధ్యాయులకు, ప్రాథమిక స్థాయిలో 120 మంది ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణను ప్రారంభించారు. ఆంగ్ల బోధనలో నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగు పర్చడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంగ్ల బోధనకు ఇప్పటి నుంచే అడుగులు పడుతున్నాయి. ఉపాధ్యాయులు ఎక్కువ మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వారే కావడంతో బోధనలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వృత్యాంతర శిక్షణ ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందేకు రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశారు. యూపీఎస్ ,హైస్కూల్ స్థాయిలో గణితం, ఫిజిక్స్,బయోసైన్స్,సోషల్ సబ్జెక్టులో 15మంది చొప్పున ఎంపిక చేశారు. వారికి జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఐదు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో సుమారు 120 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2లో శిక్షణ ఇస్తున్నారు. వీరికి రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లు ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇక్కడ శిక్షణ ముగించుకున్న ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
భాషేతర సబ్జెక్టులపై దృష్టి..
తెలుగు,హిందీ, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టుల బోధనలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పెద్దగా తేడా ఉండదు. భాషేతర సబ్జెక్టులైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంఘిక శాస్ర్తాలను ఇప్పటికిప్పుడే ఇంగ్లిష్లో బోధించాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. బోధనలో అవసరమైన నైపుణ్యాలు, విద్యార్థులకు తేలికగా అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలో ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, సామర్థ్యం పెంపొందించడం, తరగతి గదిలో ఇంగ్లిష్ మీడియం వాతావరణాన్ని సృష్టించడం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు.
ఐదు రోజుల పాటు శిక్షణ..
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై శిక్షణ ఇస్తాం. ఐదురోజుల పాటు ప్రత్యక్షంగా, ఆతర్వాత ఆన్లైన్లో ఇచ్చే శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. దీంతో విద్యార్థులకు మెరుగ్గా బోధించే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు శిక్షణకు తప్పకుండా హాజరుకావాలి.
–కంటె నర్సయ్య, కోఆర్డినేటర్