
వ్యాధులు వచ్చిన తరువాత హైరానా పడేకంటే అవి రాకుండా గ్రామాల్లో మనం చేయగలిగినదంతా ముందే చేయాలి ..అనేది భీంపూర్ పీహెచ్సీ వైద్యాధికారి, ప్రస్తుత డీఐవో విజయసారథి మాట. ఆయన మాటల్లోనే కాదు.. ఆచరణలోనూ అదే పాటిస్తారు. అందుకే భీంపూర్ పీహెచ్సీ సేవల్లో ఉత్తమంగా నిలుస్తున్నది. ప్రస్తుతం కూడా ఉత్తమ వైద్య సేవలకు గాను కమండేషన్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా కథనం..
2017లో జాతీయ అవార్డు
గ్రామాల్లో ఉప కేంద్రాల వారీగా ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలకు సర్పంచ్‌లు, ప్రజాప్రతిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి క్లోరినేషన్ లాంటివి జరిగేలా చూశారు డాక్టర్ విజయసారథి సారథ్యంలోని టీం. ఇక సగటున ఏడాదికి 200 వరకు సురక్షిత ప్రసవాలు చేయడం, నిరంతరం గర్భిణులకు ఏఎన్సీ (యాంటీ నెటల్ క్యాంప్ ) శిబిరం ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు చేయడం కొనసాగుతూనే ఉన్నది. ఇందుకుగాను 2017లో కాయకల్ప కింద జాతీయ అవార్డు పొందింది. అప్పుడూ పీహెచ్‌సీకి రూ. 2 లక్షల నగదు రివార్డు ఇచ్చారు. ఇతర జిల్లాలు,రాష్ర్టాల దవాఖానల డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి వసతులపై పరిశీలించారు.
ఇది మూడోసారి..
ఈ పీహెచ్‌సీకి అవార్డు రావడం ఇది మూడోసారి. మరికొన్ని రోజుల తరువాత ఎన్సీడీ ( నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) సర్వే చేపట్టనున్నారు. మొన్నటి కరోనా కాలంలో సిబ్బంది ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి కరోనాను నియంత్రించారు. భీంపూర్ సహా తాంసి మండల గ్రామాలు కూడా కొన్ని ఈ పీహెచ్సీ కిందే ఉన్నాయి. ఒక్క ఈ జూన్‌లోనే పీహెచ్సీలో 151 మంది గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేశారు. సర్కారు దవాఖానల్లోనే ప్రసవాలు సురక్షితమని, కేసీఆర్ కిట్ల గురించి నిరంతర అవగాహన కల్పిస్తున్నారు. పీహెచ్సీ పరిధిలో చేస్తున్న వైద్యసేవలపై సమాచారం ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తూ అందుబాటులో ఉంచుతున్నారు.
ప్రజల సహకారంతో మరిన్ని సేవలు
పీహెచ్‌సీకి గుర్తింపు వస్తుండడంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాం. వాస్తవానికి ఈ విజయాలన్నీ టీం వర్క్‌తోనే సాధ్యమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రసవాలకు ప్రైవేటును ఆశ్రయించవద్దని అవగాహన కల్పిస్తున్నాం. మారుమూల గ్రామాలకు ఐటీడీఏ అంబులెన్స్ ద్వారా సేవలందిస్తున్నాం. పీహెచ్‌సీకి వచ్చే ఇతర జిల్లాల సిబ్బందికి ఇక్కడి సేవల గురించి చెబుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలన్నీ పేదలకు అందాలన్నదే మా తపన.
ఉప కేంద్రాల్లోనూ మంచి వైద్యం
పీహెచ్సీ పరిధిలో ఉన్న ఉప కేంద్రాల్లో కొన్ని వెల్నెస్ సెంటర్లుగా రూపొందుతున్నాయి. నిజానికి ఉపకేంద్రాల్లోనే చాలా వరకు చికిత్సలు అందిస్తున్నాం. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో కలిసి గర్భిణులు, బాలింతలు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తున్నాం.