ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
సరస్వతీనగర్ పాఠశాలలో స్టీమ్ సైన్స్ ల్యాబ్ ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్, మార్చి 23 : విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మహితా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని సరస్వతీనగర్ ఉన్నత పాఠశాలలో రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసిన స్టీమ్ సైన్స్ ల్యాబ్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహిత స్వచ్ఛంద సంస్థ మూడు సైన్స్ ల్యాబ్‌లను ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తాను చదువుకున్న సమయంలో పాఠశాలల్లో ఎలాంటి వసతులు లేవని పేర్కొన్నారు. నేడు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ తమ ఉజ్వల భవిష్యతకు పునాదివేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఎన్సీసీ విద్యార్థులు కలెక్టర్‌కు గౌరవ వందనం చేసి, సాధారంగా ఆహ్వానించారు. సెక్టోరల్ అధికారి ఉదయశ్రీ, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, మహిత స్వచ్ఛంద సంస్థ సంస్థ డైరెక్టర్ రమేశ్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.