గ్రామాల్లో కార్యదర్శులు, సిబ్బంది పర్యటన
27 పంచాయతీల్లో వంద శాతం పూర్తి
నెలాఖరులోపు లక్ష్యం పూర్తవుతుందంటున్న అధికారులు
నేరడిగొండ, మార్చి 22 : మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు ముమ్మరంగా కొనసాగుతున్నది. నిర్ణీత సమయానికంటే ముందే పన్నుల వసూలు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. నెలాఖరులోపు వందశాతం పన్ను వసూలు చేసే లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు.
27 పంచాయతీల్లో వందశాతం
మండలంలో 32 పంచాయతీలు ఉండగా 27 జీపీల్లో వందశాతం పన్నులు వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆరెపల్లి, బంధంరేగడి, బొందిడి, బోరిగాం, బుద్దికొండ, దర్బతండా, గుత్పాల, ఇస్పూర్, కొర్టికల్(బీ), కొర్టికల్(కే), కుమారి, కుంటాల(బీ), కుంటాల(కే), లఖంపూర్, లింగట్ల, నాగమల్యాల, నారాయణపూర్, పీచర, రాజురా, రోల్మామడ, సావర్గాం, తర్నం(కే), తేజాపూర్, వడూర్, వాగ్దారి, వాంకిడి, యాపల్గూడ పంచాయతీల్లో వందశాతం పన్నులు పూర్తయ్యాయి. మరో ఐదు పంచాయతీల్లో పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు మండలాల వారీగా తీసుకుంటే అన్ని గ్రామ పంచాయతీల్లో 95 శాతం పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోపు మిగతా పంచాయతీల్లో వందశాతం పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
పంచాయతీ ఖాతాల్లో జమ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో పాటు ప్రజలు చెల్లించే పన్నుల నుంచే పంచాయతీల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దీని కోసం కార్యదర్శులు పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ సకాలంలో వాటిని చెల్లించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేసి ఎప్పటికప్పుడు వాటిని ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. వసూలు చేసిన పన్నులతో గ్రామాల్లో కార్మికుల వేతనాలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, నీటి ట్యాంకులు శుభ్రం, పలు అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని చెబుతున్నారు.
వందశాతం వసూలు చేశాం
ప్రజలు చెల్లించే పన్నులతోనే పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పన్నులు చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనంపై గ్రామంలో ఇప్పటికే అవగాహన కల్పించాం. దీంతో సిబ్బందితో ఇంటింటికీ వెళ్లే అవసరం లేకుండా ప్రజలే పంచాయతీకి వచ్చి పన్నులు చెల్లించారు. వందశాతం పన్నుల లక్ష్యం పూర్తి చేశాం.
—దయాకర్, పంచాయతీ కార్యదర్శి, కుమారి.