ప్రతి ప్రభుత్వశాఖలోనూ యువ ఉద్యోగులే సింహభాగం
విధుల్లో ప్రత్యేకత.. ఉన్నతాధికారుల మన్ననలు..
తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల జాతర
పట్టుదల, ప్రణాళికతో చదివితే కొలువు ఖాయం :యంగ్ జాబర్స్
నిర్మల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) ;స్వరాష్ట్రంలో కొలువుల కుంభమేళాకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగా.. తాజాగా 80 వేలకుపైగా నౌకర్ల నియామకాలకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉండగా.. ఉద్యోగ అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ ఏడేండ్ల కాలంలో వేలాది మంది యువతీయువకులు ఉద్యోగాలు సాధించారు. ప్రతి ప్రభుత్వశాఖలో యువ ఉద్యోగులే దర్శనమివ్వడం హర్షించదగ్గ పరిణామం. చాకచక్యంగా, ఉన్నతంగా ఆలోచిస్తూ పరిపాలనలో కూడా తమదైన ముద్రవేస్తున్నారు. ఉన్నతాధికా రుల మన్ననలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివిధ శాఖల్లో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్న పలువురు యువ అధికారులు తమ అంతరంగాన్ని ‘నమసే’త తో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో
మళ్లీ ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్ర అవతరణ అనంతరం ఏడున్నరేళ్ల కాలంలో దాదాపు 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు కూడా జరుగుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో నీళ్లు, నిధులను పూర్తిస్థాయిలో సాధించుకున్నాం. ఇప్పుడు నియామకాలను కూడా భర్తీ చేసుకుంటున్నాం. రెవెన్యూ, అగ్రికల్చర్, విద్య, వైద్యం తదితర ప్రభుత్వ శాఖల్లో వేలాది మంది ఉద్యోగ అభ్యర్థులు ఉద్యోగం సాధించారు. తాజాగా ఉద్యోగ సాధనలో ఉన్న అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. పట్టుదల, ప్రణాళిక, లక్ష్యం ఏర్పరుచుకొని చదువాలని, అన్ని సబ్జెక్టులపై విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కష్టపడి చదివితే ఉద్యోగం తప్పకుండా వరిస్తుందని పేర్కొంటున్నారు. కోచింగ్ లేకుండా కొలువు రాదేమోనన్న అపోహలు వీడి, కష్టపడి చదివితే ఉద్యోగం గ్యారంటీ అని పేర్కొంటున్నారు.
ప్రామాణిక పుస్తకాలు చదవాలి..
ఉమ్మడి ఏపీలో ఏదైనా ఉద్యోగం సాధించాలంటే పైరవీలు, డబ్బులు ఉండాలనే అపోహలు ఉండేవి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాటికి తావులేకుండా, ప్రతిభ ఉంటే ఉద్యోగం సాధించవచ్చనే దానికి ఒక నిదర్శనం నేనే. మాది వరంగల్ పట్టణంలోని అబ్బనికుంట కాలనీ. నాకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు అమ్మ, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయారు. మానసికంగా చాలా కృంగి పోయా. చెల్లి ప్రియాంకతో కలిసి నానమ్మ వద్దకు పోయా. నానమ్మ సక్కుబాయి ఓ హోటల్లో వంటపని చేస్తూ నన్నూ, చెల్లిని పోషించింది. అప్పుడే నేను ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకున్న. ఒకవైపు డిగ్రీ చదువుతూనే వరంగల్‌లోని ఓ ట్యుటోరియల్స్‌లో 9,10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవాన్ని. ఆ తర్వాత పార్ట్‌టైం క్లాసులు చెబుతూ, సాయంత్రం ఇంటి వద్ద ట్యూషన్లు చెబుతూ గ్రూప్-1 సాధించడమే లక్ష్యంగా చదివా. ఇంతలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ రావడంతో ఎటువంటి కోచింగ్ లేకుండా, కేవలం ప్రామాణిక పుస్తకాలు, దినపత్రికలు చదువుతూ రాశా. గ్రూప్-2 టాప్ స్కోరర్‌గా నిలిచి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యా. ప్రస్తుతం నోటిఫికేషన్లతో బంగారు అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం నేటి యువతకు అందించింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌ని పూర్తిగా దూరం పెట్టాలి. ప్రిపరేషన్‌కు అవసరమైతేనే మొబైల్‌ను వాడాలి. ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని చదవాలి.
–ఏ శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్, దస్తురాబాద్
గ్రూప్ డిస్కషన్‌తో ప్రయోజనం
తెలంగాణ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావించడం హర్షనీయం. ఒక రైతు కుటుంబంలో పుట్టిన నాకు రైతులకు సేవచేసే భాగ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత 2017లో ఉద్యానవనశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జాబ్ సంపాదించి ఉద్యానవనశాఖలో నియామకం అయ్యా. అభ్యర్థులకు నేను ఒకటే సూచిస్తున్నా. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్లు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం తక్కువగా ఉంటుంది. పూర్తిస్థాయిలో చదవలేం. ఇప్పటి నుంచే సమయం వృథా కాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయితే విజయం వరిస్తుంది. ఇచ్చిన సిలబస్‌తోపాటు కరంట్ అఫైర్స్ చదవాలి. ముఖ్యంగా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చదువుకుంటే మంచిది. ఒకరికొకరు గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే అంశాలు గుర్తుండి పోతాయి. మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. ఇతరులు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. మన లోపాలను సరిదిద్దుకొని ప్రణాళిక ప్రకారం చదివి ఉద్యోగం సాధించవచ్చు. నిర్ణీత సమయాలు కేటాయించుకొని చదవండి. అలాగే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వీటన్నింటినీ అధిగమించి ఉద్యోగం సాధించాలి. ఆల్ ది బెస్ట్.
– ఎస్.హర్షవర్ధన్‌రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్, భైంసా
పట్టుదలతో చదివితేనే..
మాది చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామం. మా నాన్న బాపు వ్యవసాయ కూలీ. అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది. అన్నీ నాన్నే అయి చూసుకున్నాడు. ఖమ్మం జిల్లా మధిరలోని ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో 2011-13లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేశాను. 2013 సెప్టెంబర్ నుంచి 2015 ఆగస్టు వరకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాను. 2015 సెప్టెంబర్ నుంచి 2016 జనవరి వరకు హాకా(హైదరాబాదు అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ)లో సోయాబీన్ విత్తనోత్పత్తిలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేశాను. 2016 ఏప్రిల్‌లో తెలంగాణ వ్యాప్తంగా 1000 ఏఈవోల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడింది. టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష రాసిన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12వ ర్యాంకు వచ్చింది. 2017 ఫిబ్రవరిలో కౌటాల మండలం తుమ్డిహట్టి క్లస్టర్ ఏఈవోగా ఉద్యోగం వచ్చింది. రైతులందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. వారంతా సొంతింటి మనిషిలా చూసుకుంటారు. ప్రణాళిక ప్రకారం.. పట్టుదలతో చదివితే అనుకున్నది సాధించవచ్చు.
–చౌదరి అంజన్న, ఏఈవో, తుమ్డిహట్టి క్లస్టర్
ఈ బుక్స్ చదివితే ఏఈ కొలువు సులువు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సర్కారు ప్రాజెక్టుల పూర్తిపై దృష్టిసారించింది. చాలా జలాశయాలు పూర్తి కాగా.. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించారు. ఇందులో ఏఈ, ఏఈఈ పోస్టులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు వరం వంటిది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత 2015 సంవత్సరంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూ ఎస్, మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్లలో ఖాళీగా ఉన్న 2వేలకుపైగా పోస్టులకు సర్కారు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్పుడే నేను ఏఈ ఉద్యోగాన్ని సాధించా. ఏఈ, ఏఈఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులతోపాటు కుర్మీ, జయరాంరెడ్డి, గుప్తా అండ్ గుప్తా రచనల బుక్స్ చదవడం మంచిది. అలాగే జనరల్ స్టడీస్‌లో తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు విజేత పబ్లికేషన్స్, హైటెక్ విజయరహ స్యం వంటి బుక్స్ చదివితే కొలువును సులువుగా సాధించవచ్చు.
-ఎం.శరత్, ఏఈ, పంచాయతీరాజ్ శాఖ, సారంగాపూర్.
ప్రభుత్వ ఉద్యోగం కష్టమేమీ కాదు
మాది రెబ్బెన మండలం గంగాపూర్. మా అమ్మా నాన్నలకు నలుగురు సంతానం. నేను చిన్నదాన్ని. 2015లో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌లో గల పంచగామలోని శివకేశవ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 2013 నుంచి 2015 వరకు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేశాను. 2016 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం 311 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, పరీక్ష రాశాను. కానీ అప్పుడు నాకు ఉద్యోగం రాలేదు. తిరిగి 2016 ఏప్రిల్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. అందులో పరీక్ష రాయగా ఉద్యోగానికి ఎంపికయ్యాను. 2017 ఫిబ్రవరిలో నాకు కౌటాల మండలంలోని మొగడ్‌ధగడ్ క్లస్టర్‌కు ఏఈవోగా ఉద్యోగం వచ్చింది. మొదట్లో ఉద్యోగం చేయాలంటే భయం వేసేది. రానురానూ రైతులతో పరిచయాలు పెరిగాయి. ఉద్యోగం కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంచుకున్న సబ్జెక్టుపై పూర్తి పట్టుసాధించాలి. ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయితే ఉద్యోగం పొందడం కష్టమేమీ కాదు.
– సొగల కల్పన, ఏఈవో, మొగడ్‌ధగడ్ క్లస్టర్
ఆరు ఉద్యోగాలు సాధించా..
మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామం. చాలా పేద కుటుంబం. మూడెకరాల భూమిలో నాన్న ఎవుసం చేసేది. పదో తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన. ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేదు. 2002లో మా అన్న సతీశ్ కుమార్‌కు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతే నా చదువు మళ్లీ పట్టాలెక్కింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగానే పెండ్లి అయ్యింది. అన్నయ్య సతీశ్, భర్త జగపతిరావు ప్రోత్సాహంతో ఫార్మసీ పూర్తి చేసిన. ఆ తర్వాత డిగ్రీ, బీఈడీ కంప్లీట్ చేసిన. హన్మకొండలోని ఓ అకాడమీలో గ్రూప్స్ శిక్షణ తీసుకుని 2016 నవంబర్‌లో గ్రూప్-2 పరీక్ష రాసిన. ఫలితాలు ఆలస్యం కావడంతో టీఎస్పీఎస్సీ ద్వారా వెలువడిన అన్ని నోటిఫికేషన్ల పరీక్షలు రాశా. మొదట ట్రైబల్ వెల్ఫేర్‌లో హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-1 ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 2018లో గ్రేడ్-2 వచ్చింది. అలాగే పంచాయతీ సెక్రటరీ, గ్రూప్-4, వీఆర్వో ఉద్యోగాలు వచ్చాయి. హెచ్‌డబ్ల్యూవోగా పని చేస్తున్న క్రమంలోనే 2019లో గ్రూప్-2 ఫలితాలు వచ్చాయి. 2020లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధుల్లో చేరా. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వస్తే గ్రూప్-1 ఉద్యోగం కొట్టాలనే నా కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్త. ప్రణాళికతో చదివితే ఏదైనా సాధ్యమే.
ఉద్యోగ అభ్యర్థులకు సూచనలు..
మొదటగా కామన్ సిలబస్ చదవాలి. ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న వారు సీరియస్‌గా ముందుకెళ్లాలి. విజేతలు, నిష్ణాతుల సూచనలు, సలహాలు తీసుకోవాలి.
పాత ప్రశ్నపత్రాల విశ్లేషణను బట్టి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర, భారత రాజ్యాంగం, కరెంట్ అఫైర్స్, సామాజిక అంశాలపై ఫోకస్ చేయాలి.అభ్యర్థులు ఉద్యోగానికి ప్రిపేరయ్యే వారితో స్నేహం చేయాలి. రోజుకో సబ్జెక్టు చొప్పున అంతా చదువుకొని గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవాలి. ఇంటికి, శుభకార్యాలకు దూరంగా ఉండాలి.