ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రశ్నాపత్రం
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు
నిర్మల్ అర్బన్, మార్చి 22: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లా మాధ్యమిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈనెల 23 నుంచి వచ్చే నెల 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం నోడల్ అధికారి పరుశురాం నిర్మల్ జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేశారు. మూడు దశలుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాల్లో మొత్తం 58,401 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. కాగా, నిర్మల్ జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 36 జూనియర్, 4 వొకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాల్లో 14,756 మంది హాజరుకానున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా ప్రశ్నాపత్రం
విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆన్లైన్లో పంపించే ప్రశ్నాపత్రం ఆధారంగా పరీక్షను నిర్వహించనున్నారు. కేంద్రాల్లోని ఎగ్జామినర్ మొబైల్కు అరగంట ముందు వచ్చిన ఓటీపీ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు పరీక్ష నిర్వహించన్నారు. ఆ తర్వాత విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.
మూడు దశలుగా..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప్రభుత్వం మూడు దశలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో ఈనెల 23 నుంచి 27 వరకు, రెండో దశలో ఈనెల 28 నుంచి ఏప్రిల్ 1 వరకు, మూడో దశలో ఏప్రిల్ 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
నేటి నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 14,756 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. మూడు దశల్లో పరీక్షలను నిర్వహిస్తాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పరీక్షలను నిర్వహిస్తాం.
పరశురాం, ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి, నిర్మల్