వర్చువల్ సమావేశంలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
పర్సువాడ(కే)లో రక్తదాన శిబిరం ప్రారంభం
ఆదిలాబాద్ టౌన్, మార్చి 22 : ప్రధానంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం పక్కాగా అందేలా పర్యవేక్షించాలని మండలస్థాయి అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసు నుంచి మండల అధికారులతో మంగళవారం వర్చువల్‌గా మాట్లాడారు. పిల్లలకు రక్తహీనత సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానికుల సహకారంతో అనుబంధ ఆహార కార్యక్రమాలు విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా, మండలస్థాయి సమావేశాలు, కార్యక్రమాల్లో అనుబంధ పోషకాహారం, అనీమియాలపై చర్చిస్తూ తగు చర్యలు చేపట్టాలన్నారు. డీడబ్ల్యూవో మిల్కా, డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్, డీఆర్డీవో కిషన్, అదనపు కలెక్టర్ నటరాజన్, ఎఫ్‌డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం ప్రారంభం..
నార్నూర్, మార్చి 22 : అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేస్తే ప్రాణదాతలుగా నిలుస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. గాదిగూడ మండలం పర్సువాడ(కే)లో దివ్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, అలాగే చేతిపంపును కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో సేవలు చేస్తున్న దివ్య శ్రీ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. సామాజిక సేవలో ముందుండేలా యువతను ప్రోత్సహిస్తూనే మారుమూల గ్రామాల్లో వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్న ఫౌండేషన్ చైర్మన్ ధారవత్ ప్రవీణ్‌కుమార్‌ను ప్రశంసించారు. అనంతరం స్థానికులు పలు సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుస్సాడీ కళాకారుడు కనక రాజును కలువడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, కుమ్రం భీం మనవడు కుమ్రం సోనేరావ్, ఎంపీడీవో రామేశ్వర్, ఆ సంస్థ వైస్ చైర్మన్ ఆత్రం భీంరావ్, సర్పంచులు గంగుబాయి, భీంబాయి గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.