శారీరక దృఢత్వం కోసమే క్రీడలు
నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ అర్బన్, మార్చి 22 : గెలుపోటములును సమానంగా తీసుకొని క్రీడల్లో ముందుకెళ్లాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఐదు రోజుల నుంచి నిర్వహిస్తున్న పోలీసు వార్షిక క్రీడలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ముగిసాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో నేరాలను పూర్తిగా నివారించేందుకు పోలీసులు శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో వార్షిక క్రీడలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని నిర్మల్, భైంసా సబ్ డివిజన్ పరిధి, నిర్మల్ ఏఆర్ పోలీసులు క్రీడల్లో పాల్గొన్నారన్నారు. శాంతి భద్రతలే ధ్యేయంగా పోలీసు శాఖ ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భైంసా డివిజన్‌కు రూ.1.30 కోట్లతో సీసీ కెమెరాలు, నిర్మల్‌లో రూ.కోటితో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భైంసాలో 10 ఎకరాల్లో బెటాలియన్ ఏర్పాటు కాబోతున్నదన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఏఎస్పీ కిరణ్ ఖారే, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, సీఐలు ఎస్సైలు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి తదితరులున్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో సమావేశం..
నిర్మల్ టౌన్, మార్చి 22 : కలెక్టరేట్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో విద్యాసంస్థలో నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలపై మాట్లాడారు. బోధన, ఫ్యాకల్టీ, భోజనం, క్రీడలు తదితర అంశాలపై ఆరా తీశారు. అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు, సిబ్బందికి ఏర్పడుతున్న సమస్యలను అంచెల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. మెరిట్ విద్యార్థులు సీట్లు సాధించి వచ్చినా కొన్ని విభాగాల్లో నిర్వహణ సరిగా లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో విద్యార్థులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి, పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.