నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం
నిర్మల్ అర్బన్, మార్చి 21 : మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ మీడియం విద్యనందించి, పాఠశాల విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు ఇంగ్లిష్లో పట్టు సాధించాలన్నారు.విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుందన్నారు. వారికి నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇంగ్లిష్లో ప్రావీణ్యం సాధించాలి
లక్ష్మణచాంద, మార్చి 21: ఉపాధ్యాయులు ఇంగ్లిష్లో ప్రావీణ్యం సాధించాలని నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి సూచించారు. మండలంలోని కనకాపూర్ అక్షర ఉన్నత పాఠశాలలో సోమవారం లక్ష్మణచాంద, మామడ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆంగ్లంలో బోధనపై అవగాహన, ఐదురోజుల శిక్షణ కార్యక్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఒకటి నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నదన్నారు. ఆంగ్లంలో బోదనకు అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, జిల్లా పరిశీలకుడు సంజయ్, మెంటార్స్ శ్రీనివాస్ రెడ్డి, శ్రావ్య, పావని, సీఆర్పీ సుధాకర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అర్షద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.