ఐటీడీఏ పీవో అంకిత్
ఉట్నూర్, మార్చి21ః గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోని పీవో క్యాంపు కార్యాలయంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు. అర్జీల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
పోటీ పరీక్షలకు అందించే ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. స్థానిక లాల్టేకిడిలో నిరుద్యోగ యువతకు సోమవారం నిర్వహించిన అర్హత పరీక్షను పరిశీలించారు. 1500 మంది నిరుద్యోగులు పరీక్ష రాశారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఐటీడీఏ ఖర్చుతో శిక్షణను ఇస్తున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో జేడీఎం నాగభూషణం, రమణ, అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలలో డిప్యూటేషన్‌పై అధ్యాపకులుగా బోధించేందుకు వచ్చేనెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలని పీవో కోరారు. ఎంఏ సోషియాలజీ, హింది, ఐసీటీ, ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, పర్ఫామింగ్ ఆర్ట్స్‌లో పదేళ్ల బోధన అనుభవం ఉండాలని, ఆయా సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని వివరించారు. దరఖాస్తుల కు విద్యార్హత జిరాక్స్ కాపీలతో పాటు ఫొటోలు జతచేయాలని సూచించారు. పీజీహెచ్ఎం, ఎస్ఏ, ఎస్జీటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.