తలమడుగు, మార్చి 21 : ప్రతి గ్రామంలో ఆయుష్ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి అన్నారు. మండలంలోని కుచులపూర్లో ఆయుష్ డిస్పెన్సరీ, యోగ షెడ్డు ఏర్పాటుకు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి సోమవారం స్థల పరిశీలన చేశారు. పంచాయతీలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయుష్ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. నిధులు మంజూరు చేస్తామని, ప్రత్యేక గదిని నిర్మించాలని సూచించారు. కుచులపూర్లో ఆయుష్ సేవలందించేందుకు భవనంతో పాటు యోగా కోసం షెడ్డును త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిషనర్ వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, పీవో ఎన్సీడీ క్రాంతి, ఆయుష్ వైద్యాధికారి ఫరీదా, హోమియోపతి పవన్, మండల వైద్యాధికారి రాహుల్, ఎంపీపీ కల్యాణం లక్ష్మి, సర్పంచ్ మోహిత ప్రభ, వైద్య సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.