టీజీబీలో రూ. 1.25 కోట్లు డ్రా చేసిన సీఎస్పీ
మేనేజర్ ఫిర్యాదుతో పోలీసుల విచారణ
నిందితుడి అరెస్టు
నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎదులాపురం, మార్చి 21: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకున్న ఓ సర్వీస్ ప్రొవైడర్ తన వద్దకు వచ్చే రైతుల కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.25 కోట్లకు పైగా డబ్బులు స్వాహా చేశాడు. గత సెప్టెంబర్ నుంచి జరుగుతున్న ఈ స్వాహా పర్వాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఐఆర్ఐఎక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎస్పీ( కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్), బ్యాంకు మిత్రగా జేటాల రమేశ్‌ను నియమించుకుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకున్న రమేశ్ పలువురి కిసాన్‌క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1.25 కోట్లకు పైగా డబ్బులు గ్రా చేశాడు. ఆ డబ్బులోంచి తన కుటుంబ సభ్యులు, బంధువులకు ఇవ్వగా, మరికొంత మొత్తాన్ని తనకున్న అప్పులు చెల్లించాడు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా అయిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిలాబాద్ ప్రధానశాఖ మేనేజేర్ మహీ వివేక్ సీఎస్పీ జెటాల రమేశ్‌పై ఈ నెల 17న ఆదిలాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎస్పీ రమేశ్ పలువురి క్రెడిట్ కార్డుల నుంచి విడుతల వారీగా రూ. 1.25 కోట్లకు పైగా డబ్బులు స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చిన్న సల్పలగూడకు చెందిన మడావి రాంబాయి కిసాన్ క్రెడిట్ కార్డు నుంచి రూ.72,78,000, కొడప భీంరావ్ కార్డు నుంచి రూ.35,00,200, కొడప గంగాదేవి కార్డు నుంచి రూ.17,40,100 ఇలా మొత్తంగా రూ.1,25,18,300 స్వైప్ చేశాడు. అందులో నుంచి విడుతల వారీగా మడావి రాంబాయికి రూ.9.50 లక్షలు, కొడప భీమ్రావుకు రూ.5.80 లక్షలు, కొడప గంగాదేవికి రూ.1.50 లక్షలు ఇచ్చాడు. బంధువు తిరుపతికి రూ.18లక్షలు, అతని సోదరులు స్వామికి రూ.15 లక్షలు, గంగయ్యకు రూ.4లక్షలు, సోదరులు ఆశన్న కొడుకు దత్తుకు రూ.4లక్షలు, శంకర్ కొడుకు అశోక్‌కు రూ.1.60 లక్షలు, గ్రామానికి చెందిన మడావి కిషన్‌కు రూ.40వేలు, కారే షేకన్నకు రూ.లక్ష, రాందాస్‌కు రూ.1.50 లక్షలు, మామిడికొరి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు రూ.50 వేలు, సంగ్వి గ్రామానికి చెందిన పరమేశ్‌కు రూ.20 వేలు, బట్టిసావర్గాం గ్రామానికి చెందిన సతీశ్‌కు రూ.40వేలుకు, ఆదిలాబాద్‌లోని శాంతినగర్ చెందిన చిన్నయ్యకు రూ.20వేలు, గోపికి రూ.32 వేలు ఇచ్చాడు.
తన గ్రామానికి చెందిన రాకేశ్‌కు రూ.1.80 లక్షలు అప్పు ఉండగా అవి తీర్చేశాడు. అలాగే పంట రుణం రూ.1.36 లక్షలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చెల్లించాడు. రమేశ్ నుంచి బ్యాంకు అధికారులు రూ.45,92,210 స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడలోని తన ఇంటి వద్ద రమేశ్ ఉన్నాడనే సమాచారంతో అరెస్టు చేశారు. అతని నుంచి రూ.20వేలు, రూ.4 లక్షల విలువైన రెండు కెమెరాలు రూ.80,900 విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బీ రఘుపతి, ఎస్ఐ హరిబాబు ఉన్నారు.