పనులుచేయకుండానే కూలీలకు డబ్బుల చెల్లింపు
పలు చోట్ల మస్టర్లలో సంతకాల ఫోర్జరీ
బోథ్, మార్చ్ 21: మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో అక్రమాలు వెలుగు చూసాయి. సోమవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. సాయంత్రం వరకు సుమారు 30 పంచాయతీలకు సంబంధించి గ్రామ స్థాయిలో చేపట్టిన తనిఖీల వివరాలను వేదికలో చదివి వినిపించారు. నక్కలవాడ, మందబొగుడ, ధన్నూర్ (బీ), కౌఠ (బీ), కన్గుట్ట, కుచ్లాపూర్, పిప్పల్ధరి తదితర గ్రామాల్లో జరిగిన పనుల వివరాలను డీఆర్పీలు వెల్లడించారు. చాలా గ్రామాల్లో పని చేయకుండానే కూలీలకు డబ్బులు అందినట్లు సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. మట్టి కట్టలు, మళ్లింపు కాలువల పనులు ఆనవాళ్లు లేకుండా పోయాయని వెల్లడించారు. పలు చోట్ల మస్టర్లలో కూలీల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేలిందన్నారు. హరితహారం కింద నాటిన మొక్కలు, ప్రస్తుతం బతికి ఉన్న మొక్కల సంఖ్యలో భారీగా తేడాలున్నట్లు తనిఖీ బృందాలు వెల్లడించాయి. ధన్నూర్ (బీ) గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో పనులు చేయకున్నా చేసినట్లు రికార్డులు సృష్టించి డబ్బులు తీసుకున్నారని ప్రజా వేదిక దృష్టికి తీసుకు రావడంతో అధికారులు కంగుతిన్నారు. డబ్బులు రికవరీ చేయిస్తామని పీడీ ప్రకటించారు. డీఆర్డీవో కిషన్, ఏపీడీ రవీందర్ రాథోడ్, ఎస్టీఎం దత్తు, ఏవీవో చంద్రశేఖర్, హెచ్ఆర్ మేనేజర్ రషీద్, ఎస్పార్పీలు దత్తు, శ్రీధర్, సాయన్న, ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీడీవో రాథోడ్ రాధ, ఏపీవోలు శ్రీనివాస్, శ్యాం, టెక్నికల్ అసిస్టెంట్లు, సీవో లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధి హామీ కూలీలు, మేట్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.