నిర్మల్‌లో సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు
ప్రస్తుతం 35 మంది సభ్యులు
ఇందులో వైద్యులే అధికం
నిర్మల్ చైన్‌గేట్, మార్చి 21: ప్రస్తుతం మనిషి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి.మూడు పదుల వయస్సులోనే అనేక రోగాలు వెంటాడుతున్నాయి. వీటి నుంచి రక్షణకు, ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఆరోగ్య నియమాలు పాటించడం తప్పనిసరైంది. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా దైనందిన జీవితంలో వ్యాయామం, నడక, సైక్లింగ్ వైపు యువత అడుగులు వేస్తున్నది. నిర్మల్‌లో కొంతమంది వైద్యులు సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసుకొని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అందరికీ చేరవేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుత ‘స్మార్ట్’ ప్రపంచంలో 35 ఏళ్లు దాటితే చాలు.. పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. బీపీ, షుగర్, గుండె, ఊబకాయం తదితర వ్యాధులు యుక్త వయస్సు నుంచే వెంటాడుతున్నాయి. వీటి నుంచి రక్షించుకునేందుకు పలు ఆరోగ్య నియమాలు పాటించడమేనని మందుగా నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామం, నడక, సైక్లింగ్‌పై దృష్టి సారిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలుంటుందని సూచిస్తున్నారు. అయితే, నిర్మల్ జిల్లా కేంద్రంలో పలువురు యువ వైద్యులు, యువకులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి పలు గ్రామాలకు సైకిల్‌పై వెళ్తూ ఆరోగ్యంపై పలువురికి అవగాహన కల్పిస్తున్నారు. 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు సైకిల్ పై వెళ్తూ ఫిట్నెస్ను కాపాడుకోవడమే కాకుండా మరికొందరిలో స్ఫూర్తి నింపుతు న్నారు. ప్రస్తుతం క్లబ్లో 35 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా సైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిర్మల్‌లో క్లబ్ అభివృద్ధికి డా. రాంచంద్రారెడ్డి, డా. నర్సింహారెడ్డి, డా. రామకృష్ణ, రఘునందన్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, భిక్షపతి తదితరులు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే ఈ క్లబ్‌కు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ విడుదల చేశారు.
రోగాలు నియంత్రించవచ్చు..
దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు నిత్యం వ్యాయామం చేయాలి. ఇందులో ఊబకాయం ఉన్నవారికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాక్‌పెయిన్, మెడనొప్పి, కండరాల నొప్పి, బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. సైక్లింగ్ ద్వారా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. నిత్యం సైక్లింగ్ చేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సైక్లింగ్ క్లబ్ సభ్యులు నిర్మల్ చుట్టు పక్కల గ్రామాలకు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు వెళ్తుంటాం. క్లబ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. క్లబ్‌ను విస్తరించాలని అనుకుంటున్నాం. భవిష్యత్తులో క్లబ్ ద్వారా ఆరోగ్య శిబిరాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు తగు ప్రణాళిక తయారు చేస్తున్నాం.
–డా. రామకృష్ణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
జీవన ప్రమాణాలు పెంపొందుతాయి
సైక్లింగ్ చేయడం వల్ల మనిషి జీవన ప్రమాణాలు పెంపొందుతాయి. ప్రస్తుతం పెద్ద నగరాల్లో చాలా చోట్ల సైక్లింగ్ క్లబ్‌లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు మేమంతా కృషి చేస్తున్నాం. నిత్యం 20 మంది వరకు సైకిల్‌పై వెళ్లడం అలవాటుగా చేసుకున్నాం. నిర్మల్ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుంటాం. పచ్చని పంట పొలాలు, ప్రకృతి అందాలవైపు వెళ్లడం ద్వారా ఫిట్నెస్ను కాపాడుకునే వీలుంటుంది. ప్రస్తుతం క్లబ్లో 35 మంది సభ్యులం ఉన్నాం. నిత్యం సైకిల్ తొక్కడం ద్వారా కలిగే లాభాలను అందరికీ వివరిస్తున్నాం.
–రాకేశ్‌రెడ్డి, సైక్లింగ్ క్లబ్ అధ్యక్షుడు
సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం..
నిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ప్రస్తుతం అంతా 35 ఏళ్లు దాటితే చాలు.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. రెండేళ్లుగా నిత్యం సైక్లింగ్ చేస్తున్నా. అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్మల్‌లో సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేశాం. క్లబ్‌ను విస్తరించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. క్లబ్లో
చేరేందుకు ఎలాంటి రుసుం ఉండదు. ఎవరైనా సభ్యత్వం తీసుకోవ చ్చు. సైక్లింగ్ ఉదయం వేళల్లో నిర్వహిస్తాం. హెల్మెట్, సైకిల్ లైట్లు తప్పనిసరి ఉండాలి. నిత్యం సైకిల్‌పై గ్రామాలకు వెళ్లడం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
– డా. రఘునందన్‌రెడ్డి, సైక్లింగ్ క్లబ్ ఉపాధ్యక్షుడు