వర్షం పడిందంటే చాలు.. ఒకప్పుడు రైతుల నోట ‘చెరువుకు గండి పడిందన్న’ మాటలే వినబడేవి. అప్పటివరకు నిండుకుండలా ఉన్న చెరువులు కొద్దిపాటి వర్షాలకే గండి పడి ఖాళీ అయ్యేవి. సాగు ప్రశ్నార్థకంగా మారేది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేశాక చెరువుల రూపురేఖలే మారిపోయాయి. జీవం కోల్పోయిన చిన్ననీటి వనరులకు పథకం కల్పతరువుగా మారింది. దశాబ్దాలుగా వినిపించిన గండ్ల పదానికి చరమగీతం పడింది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వారం రోజులు కుండపోత వర్షం కురిసింది. ఒక్క చెరువు కట్ట తెగలేదు. ఇదంతా కూడా మిషన్ కాకతీయ పుణ్యమే. ఈ పథకం కింద నాలుగు విడుతలుగా చెరువులను పునరుద్ధరించారు. రాష్ట్ర సర్కారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఫలితంగా నీటి వృథాకు అడ్డుకట్ట పడడంతో రైతాంగానికి కడగండ్లు తప్పాయి.
ఈ చిత్రంలో మత్తడి పారుతున్నది కుమ్రం భీం ఆసిఫాబాద్ దహెగాంలోని పెద్ద చెరువు. 2016లో రాష్ట్ర సర్కారు ‘మిషన్ కాకతీయ’ ద్వారా రూ. 25 లక్షలు మంజూరు చేయగా, రూ. 18 లక్షలతోనే పునరుద్ధరించారు. చెరువు కట్టను బలంగా తయారు చేసి పూడిక తీయడంతో సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏమాత్రం చెక్కు చెదరలేదు.
నిర్మల్ (నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, జూలై 17 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాల నిచ్చింది. దశాబ్దాల తరబడి మట్టికట్టలు మరమ్మతుకు నోచుకోకపోవడం, నోళ్లు తెరిచిన చెరువుల పాలిట కల్పతరువుగా మారింది. యేటా వర్షం పడ్డప్పుడు ‘గండ్లు’ అనే మాట వినిపించేది. నేడు వినబడకపోగా రైతుల కడగండ్లను తీర్చింది. తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టడం మూలంగా చెరువుల స్వరూపం మారింది. ఏళ్ల తరబడి దగా పడ్డ జిల్లా ప్రజల బతుకు చిత్రం మారింది. పూర్వవైభవం సంతరించుకున్న నీటి వనరులతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. బోరు బావులకు జలకళ వచ్చింది. ఫలితంగా సాగు, తాగు నీటి సమస్యలు కాలక్రమేనా సమసిపోతున్నాయి. వ్యవసాయరంగం పురోభివృద్ధిని సాధిస్తున్నది. వ్యవసాయ అనుబంధ వృత్తుల జీవన గమనంలోనూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. పశుపక్షాదులకు తాగునీరు, కుల వృత్తులకు సొంతూర్లలోనే చేతినిండా పని లభించడంతో ఆర్థిక పరిపుష్టి చేకూరుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ కాకతీయ పథకంతో ఫలాలు అందడం, జిల్లా ప్రజల జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
రూ.91.08 కోట్లతో 348 చెరువులకు పూర్వవైభవం
ఒకప్పుడు విశాలంగా ఉన్న చెరువులు.. కాలక్రమంలో నీటి గుంతల్లా మారిపోయాయి. ఉన్న ఆ కొద్దిపాటి వనరుల్లోకి వర్షం నీళ్లొచ్చినా నిల్వ ఉండలేని పరిస్థితి. భారీ వరదల వల్ల ‘గండ్లు’ పడితే ఒక్క రోజులోనే చెరువులు ఖాళీ అయిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో అంతరించిపోతున్న జల వనరులను మళ్లీ పునరుద్ధరించాలన్న సదుద్దేశంతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువుల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కాకతీయ రాజుల పాలనలో కళకళలాడిన గొలుసు కట్టు చెరువులు దశాబ్దాల కాలం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 372 చెరువులకు మిషన్ కాకతీయ పథకం కింద పూర్వ వైభవం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.159.50 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు నాలుగు విడుతల్లో రూ.91.08 కోట్ల వరకు నిధులు వెచ్చించి 348 చెరువులను బాగు చేయించింది. ఈ నిధులతో తూములు మరమ్మతుకు నోచుకున్నాయి. చెరువుల అంతర్భాగంలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు యాభై వరకు చిన్ననీటి వనరులు దెబ్బతిన్నట్లు నీటి పారుదలశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. అయితే ఇందులో మిషన్ కాకతీయ పథకం కింద మరమ్మతు చేపట్టిన చెరువు ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఒకటి, రెండు చెరువుల మట్టికట్టలు కొద్దిపాటిగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పటిష్టపర్చడమే ఇందుకు కారణంగా వారు ఉదహరిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకం లేకుంటే ప్రస్తుత వర్షాల కారణంగా జరిగే నష్టాన్ని ఊహించలేమని వారంటున్నారు.
ఈ చిత్రంలో మత్తడిపోస్తున్నది చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ చెరువు. 2016లో మిషన్ కాకతీయ ద్వారా రూ. 15.9 లక్షలతో చెరువును పునరుద్ధరించారు. రెండున్నర మీటర్లు ఉండే చెరువు కట్టను 3.40 మీటర్ల ఎత్తుకు పెంచారు. అంతకుముందు 30 ఎకరాలకు సాగు నీరందించిన ఈ చెరువు, మరమ్మతుల తర్వాత 90 ఎకరాల ఆయకట్టుకు భరోసానిస్తున్నది. ఇటీవల వరద ముంచెత్తగా ఏమాత్రం చెక్కు చెదరలేదు.
సబ్బండ వర్గాలకు కాకతీయ ఫలాలు..
మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలు ఇవ్వడంతో పూడికతో నిండిన చెరువులు, కూరుకుపోయిన మట్టికట్టలు ఎక్కడా కనిపించడం లేదు. ‘గండ్లు’ అన్న మాటే లేకపోగా.. కురిసిన ప్రతి వర్షపు చుక్క కాలువల ద్వారా చెరువులకు.. అటు నుంచి పొలాలకు చేరుతున్నది. బోరు బావుల్లో ఎక్కడ చూసినా పాతాళ గంగ ఉబికి వస్తున్నది. ఈసారి జూలైలోనే విస్తారంగా వర్షాలు కురవగా.. మిషన్ కాకతీయతో పునర్జీవం పొందిన ఎన్నో చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నీటి పారుదల శాఖ పరిధిలోని 613 చెరువులు మత్తడి పోస్తూ.. సాగుపై రైతులకు పూర్తి భరోసాను నింపుతున్నాయి. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను యేటా వదులుతుండడంతో మత్స్యకారులకు కూడా మిషన్ కాకతీయ చెరువులు ఆదరువు అవుతున్నాయి. పశుపక్షాదులకు కూడా నీరు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునర్జీవం పోసుకున్నాయి. వేలాది ఎకరాలకు సాగు నీరందిస్తూ రైతుల భవిష్యత్‌కు భరోసానిస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. 55 కోట్లు మంజూరు చేయగా, మొదటి విడుతలో 185 చెరువులు, రెండో విడుతలో 121 చెరువులు, మూడో విడుతలో 63 చెరువులను పునరుద్ధరించారు. ఇక నాలుగో విడుతలో 43 చెరువులను పునరుద్ధరిస్తుండగా, పురోగతిలో ఉన్నాయి. గతంలో 60 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందగా, మరమ్మతుల తర్వాత ప్రస్తుతం లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతున్నది.
వరదలను సైతం తట్టుకొని చెక్కు చెదరకుండా..
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెరువులు తట్టుకొని చెక్కు చెదరకుండా నిలబడ్డాయి. జిల్లాలో 534 చెరువులుండగా, మొత్తం చెరువులు పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. 100 ఎకరాలకు పైగా సాగునీరు అందించే చెరువులు 158 ఉండగా, 100 ఎకరాల లోపు సాగు నీరందించే చెరువులు 376 వరకు ఉన్నాయి. సమైక్య పాలనలో చిన్నపాటి వర్షాలకే చెరువులకు గండ్లు పడి నీరంతా వృథాగా పోయేది. కానీ.. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులన్నింటికీ మరమ్మతులు చేయడంతో పటిష్ఠంగా మారాయి. ఇటీవల పోటెత్తిన వరదలను సైతం తట్టుకోగలిగాయి.
పంటలకు ఢోకాలేదు
మాది దహెగాం. ఊరి పక్కనే పెద్ద చెరువు ఉంది. టీఆర్ఎస్ సర్కారు ఆరేళ్ల క్రితం ఈ చెరువును బాగు చేయడంతో పటిష్ఠంగా మారింది. సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మా చెరువు కొట్టుకుపోతుందని భయపడ్డాం. కానీ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ చెరువును బాగు చేయడం వల్ల మా పంటలకు ఢోకా లేకుంటైంది.
– పులగం వెంకయ్య, దహెగాం