న్యూఢిల్లీ, మార్చి 18 : దక్షిణ ఇరాన్ సముద్ర తీరంలో గల పార్స్ సహజ వాయు క్షేత్రానికి సంబంధించిన సదుపాయాలపై బుధవారం దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని మీడియా వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన దక్షిణ బుషెహర్ ప్రావిన్సులోని అసలుయేహ్ వద్ద ఉన్న సదుపాయాలపై దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ అధీనంలోని టెలివిజన్, ఇర్నా వార్తా సంస్థ తెలిపాయి. అయితే పూర్తి వివరాలను అవి వెల్లడించలేదు. పర్షియన్ గల్ఫ్‌లోని సముద్రతీర క్షేత్రాన్ని ఇరాన్ ఖతార్‌తో పంచుకుంటుంది. యుద్ధ సమయంలో ఇతర గల్ఫ్, అరబ్ దేశాలతోపాటు ఖతార్‌పై పదేపదే ఇరాన్ దాడి చేసింది. ఈ దాడి చేసింది ఇజ్రాయెలా లేదా అమెరికా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా, అమెరికా ప్రధానంగా దక్షిణ ఇరాన్‌పైనే తన దాడిని కేంద్రీకృతం చేసింది. ఇరాన్‌కు చెందిన ప్రధాన చమురు నిల్వ కేంద్రమైన పర్షియన్ గల్ఫ్‌లోని ఖర్గ్ ద్వీపంపై అమెరికా ఇటీవల దాడి చేసింది. కాగా, పార్స్ సహజ వాయు క్షేత్రానికి సంబంధించిన సదుపాయాలపై జరిగిన దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు, గ్యాస్ సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించే పరిభాషనే వాడుతూ సౌదీ అరేబియాలోని సమ్రెఫ్ రిఫైనరీ, దాని జుబెయిల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై దాడి చేస్తామని ఇరాన్ నిర్దిష్టమైన హెచ్చరికలు జారీచేసింది. యూఏఈకి చెందిన అల్ హసన్ గ్యాస్ క్షేత్రాన్ని, పెట్రోకెమికల్ ప్లాంట్లు, ఖతార్‌లోని రిఫైనరీని ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీచేసింది. తన దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రం, దాని అనుబంధ సదుపాయాలపై బుధవారం తెల్లవారుజామున దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది.
ఇరాన్‌కు చెందిన మరో ఉన్నతాధికారిని చంపివేసినట్లు ఇజ్రాయెల్ బుధవారం ప్రకటించగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇద్దరిని బలిగొన్నాయి. ఇరాన్ నిఘా శాఖ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మంగళవారం రాత్రి జరిగిన సైనిక దాడిలో మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ ఉన్నత భద్రతాధికారి అలీ లారీజానీ, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డు అధిపతి బీజ్ ఫోర్స్‌ను ఇజ్రాయెల్ హతమార్చింది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ తన దాడులను బుధవారం కూడా ఉధృతంగా కొనసాగించింది. బీరుట్‌లోని అనేక అపార్ట్మెంట్లపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో డజను మంది వరకు మరణించారు. ఇరాన్లో బుషెహర్ అణు విద్యుత్తు కేంద్రం సముదాయంపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో ప్రాణనష్టం కాని విద్యుత్తు కేంద్రానికి నష్టం కాని జరుగలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాసీ తెలిపారు.
ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ నిఘా సంస్థకు గూఢచారిగా పనిచేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తికి ఇరాన్ మరణశిక్ష అమలుచేసింది. ఆ వ్యక్తిని కౌరోష్ కెయ్యానీగా గుర్తించిన మిజాన్ వార్తా సంస్థ ఇరాన్‌కు చెందిన కీలక ఫొటోలు, ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు అతను చేరవేసినట్లు తెలిపింది. కాగా, దక్షిణ ఫార్స్ ప్రావిన్సులోని అరెస్థాన్లో ఓ కోర్టు సముదాయంపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడి జరిపినట్లు మిజాన్ తెలిపింది. పలువురు సిబ్బంది, పౌరులు మరణించగా అనేకమంది గాయపడినట్లు వార్తా సంస్థ పేర్కొన్నది.
చమురు క్షేత్రాలకు నిలయమైన సౌదీ అరేబియాకు చెందిన తూర్పు ప్రావిన్సుతోపాటు కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపై ఇరాన్ దాడులు జరిపింది. యూఏఈలోని తమ రక్షణ స్థావరం వద్ద పడిన క్షిపణి వల్ల స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తెలిపారు. అయితే ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. పశ్చిమాసియాకు ట్రాన్సిట్ హబ్‌గా పశ్చిమ దేశాలు ఉపయోగించుకుంటున్న అల్ మిన్హద్ ఎయిర్ బేస్ సమీపంలో బుధవారం భారీ పేలుళ్లు వినిపించాయి. దుబాయ్ వ్యాప్తంగా సైరన్లు మార్మోగగా నింగిలోనే రక్షణ వ్యవస్థలు దాడులను అడ్డుకున్నాయి.