హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అయితే, కనీసం మీ చేతుల్లో ఉన్నదైనా అమలుచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్‌ను ఈ బడ్జెట్ కేటాయింపుల్లో అమలుచేయాలని కోరారు.
ఇవే కాకుండా రూ.10వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ బకాయిలు చెల్లించాలన్నారు. ‘బీసీ రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీలో డ్రామా నడిపారు. ఈ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ హాజరుకాలేదు. బీసీలంటే అంత చులకనా?. కాంగ్రెస్‌లోని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురవుతున్నారు. బయటికి చెప్పుకోలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు.