ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న మహిళలు lసొంతంగా పరిశ్రమలు ఏర్పాటు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 438 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి సర్కారు గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు అందిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.47 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 320 గ్రామైక్య సంఘాలకు రూ.39.88 కోట్లు అందించారు. ఈ రుణాలను వినియోగించుకుంటూ స్వయం ఉపాధి, వ్యాపారం, పారిశ్రామికంగా రాణిస్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గేదెలను అందించేందుకు రూ. 4.67 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ఒక్కొక్క యూనిట్‌కు రూ.93వేలతో గేదెల పెంపకానికి ముందుకొచ్చే సభ్యులను ఎంపిక చేసి వారికి రుణాలు అందిస్తున్నారు. జిల్లాలో 500 యూనిట్లు అమలు చేస్తున్నారు. పాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా విజయ డెయిరీని ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిస్థాయిలో గేదెలను అందించాలని సంకల్పించారు. రూ.40 లక్షలతో మిల్లెట్ (చిరుధాన్యాల డ్రై మిక్సింగ్) యూనిట్‌ను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో రూ.50 లక్షలతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మినీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. శ్రీనిధి ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు గేదెలు, బట్టల వ్యాపారం, సూపర్ మార్కెట్లు, సినిమా థియేటర్, మిల్లెట్ పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
రూ.40 లక్షలతో పరిశ్రమ ఏర్పాటు
శ్రీనిధి ద్వారా అందించిన రూ.40 లక్షలతో చిరుధాన్యాల డ్రై మిక్స్డ్ యూనిట్‌ను స్థాపించాం. అధికారులు శిక్షణ ఇచ్చి.. కౌటగూడ వద్ద మా బాలాజీ స్వయం సహాయక సంఘం ద్వారా యూనిట్‌ను ఏర్పాటు చేయించారు. ఇక్కడ పది రకాల మిషన్లతో పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారైన చిరుధాన్యాల పౌష్టికాహారాన్ని ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నాం.
– మడావి మంజుల, పరిశ్రమ నిర్వహణ సంఘం అధ్యక్షురాలు.
రూ.1.80 లక్షలు తీసుకున్నాం..
నేను శ్రీనిధి నుంచి రుణం తీసుకొని రెండు గేదెలు కొనుగోలు చేశా. మొదట ఒక గేదెను తీసుకున్నా. లాభసాటిగా ఉండడంతో రెండో గేదెను కూడా తీసుకున్నా. అధికారులు మొదటి సారి రూ. 90 వేలు, రెండోసారి రూ.90 వేల రుణం ఇచ్చారు. రోజుకు సుమారు రూ.1000 వరకు పాలు విక్రయిస్తున్నా. మా సంఘంలో చాలా మంది శ్రీనిధి రుణాలను తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు.
– అప్పపల్లి పార్వతి, ఆసిఫాబాద్.
సూపర్ మార్కెట్ పెట్టిన..
శ్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకొని సూపర్ మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించా. తిర్యాణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసి, అధికారుల సహకారంతో మెళకువలు తెలుసుకొని నిర్వహిస్తున్నా. మహిళలు వ్యాపారంలో అభివృద్ధి చెందేందుకు శ్రీనిధి రుణం ఉపయోగపడుతున్నది. – మహేశ్వరి, తిర్యాణి.