ఉదయం తొమ్మిదింటి నుంచే సెగలు
ఒంటిపూట బడులు షురూ
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత
మొదలైన ఏసీలు, కూలర్ల వినియోగం
శీతలపానీయాలకు గిరాకీ..
మంచిర్యాల, మార్చి 16, నమస్తే తెలంగాణ :మార్చిలోనే ఎండలు ముదిరిపోయాయి. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా, బుధవారం గరిష్ఠంగా 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఉదయం తొమ్మిదింటి నుంచే భానుడు భగభగ మండుతుండడంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. నిన్న మొన్నటి దాకా చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా.. ఇక మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే శీతలపానీయాలను ఆశ్రయించడంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు.
జిల్లాలో ఎండలు ముదిరిపోతున్నాయి. మధ్యాహ్నాం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెలలో 15 డిగ్రీల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ నెల మొదటి వారం నుంచి 20 డిగ్రీలకు చేరుకున్నాయి. జిల్లాలో 30 డిగ్రీల వరకు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో జనసంచారం లేక మధ్యాహ్నం రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలవుతున్నాయి. ఓ వైపు ఒంటి పూట బడులు కూడా ప్రారంభమయ్యాయి. బుధవారం గరిష్ఠంగా 39 డిగ్రీలకు చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఇంకా ఎలా ఉంటుందోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
శీతల పానీయాలు, దోసకాయలు, పుచ్చకాయలకు గిరాకీ..
మార్చి మొదటివారంలో జిల్లాలో 34 డిగ్రీలు గరిష్ఠ, 19 కనిష్ఠ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బుధవారం నాటికి 39 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రానున్న వారం రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్నది. మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట వంటి ప్రధాన పట్టణాల్లో మధ్యాహ్నం జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సూర్యతాపంతో పాటు వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రజలు పుచ్చకాయలు, దోస కాయలతో పాటు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండలు రోజురోజుకూ పెరుగుతుండడంతో పేదోడి ఫ్రిజ్ అయిన రంజన్లు, చల్లని గాలి కోసం కూలర్ల గిరాకీ కూడా బాగానే ఉంటున్నదని దుకాణదారులు చెబుతున్నారు. వేడిగాలులు, ఎండ తీవ్రతతో అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్డుపైకి రావడంలేదు. వచ్చినా చల్లదనం కోసం చెట్లు, ఇతర ప్రదేశాల్లో సేదతీరుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
జిల్లాలో వారం పది రోజుల క్రితం చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరిగింది. జిల్లాలో ఈనెల 10న కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 17.2, 34.2 నమోదు అయ్యింది. 11న కనిష్ఠ, గరిష్ఠంగా 18.5, 36.5, 12న 19.8 , 37.6 , 13న 19.9, 38.1, 14న 20,38.4, 15న 21, 38.6 16న కనిష్ఠ 22, గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.