నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
పెంబి మండలం చాకిరేవులో పర్యటన
పెంబి, మార్చి 16: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చాకిరేవులో విద్యుత్, నీటి సమస్య పరిష్కరిస్తామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ స్పష్టంచేశారు. విద్యుత్, తాగునీటితో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలని మూడు రోజుల క్రితం దాదాపు 30 మంది చాకిరేవు గ్రామస్తులు నిర్మల్ జిల్లా కేంద్రానికి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో కలెక్టర్ బుధవారం చాకిరేవు గ్రామంలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 20 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, తాగునీటిని వాగుకు వెళ్లి తెచ్చుకుంటున్నామని తెలిపారు.
విద్యుత్ లేక అంధకారంలో జీవిస్తున్నామని వాపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ గ్రామం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని, ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. మెరుగైన సౌకర్యాలున్న ప్రాంతంలో ప్రతి కుటుంబానికీ డబుల్ బెడ్ రూం ఇల్లు, రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని, ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ప్రజలు ఇక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. ఆరు నెలల్లో గ్రామంలో విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ జైవంత్ చౌహాన్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో వికాస్ మీనన్, ఎఫ్‌డీవో కోటేశ్వర్ రావు, ఎంపీడీవో లింబాద్రి, ఏడీఏ ఆసం రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పంచ్‌లు శంభు, పూర్ణచందర్ గౌడ్, ఎంపీటీసీ రామారావ్ ఉన్నారు.