ఎదులాపురం, మార్చి 16 : ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత ఉన్న 12-14 ఏండ్ల వయసున్న పిల్లలు కార్బి వాక్స్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఎం.శ్రీకాంత్ అన్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కార్బివాక్స్ వ్యాక్సిన్ ప్రారంభంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పూత్లిబౌలి యూపీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. జిల్లాలో మొదటి డోసును భాగ్యనగర్‌కు చెందిన లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో చదువుతున్న జి.వర్షిత వేయించుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు చిన్న పిల్లలకు కార్బివాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలు వారి తల్లి లేదా తండ్రి సమక్షంలో వ్యాక్సిన్ వేయించుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండేలా చూడాలన్నారు. 1, జనవరి 2008 నుంచి 15, మార్చి 2010 మధ్యలో పుట్టిన వారికి కార్బివాక్స్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మెడికల్ ఆఫీసర్లు వినోద్ కుమార్, శ్రీకాంత్, సీవోలు నవీన్ కుమార్, రాజారెడ్డి, స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు ఉన్నారు. కాగా.. జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా పీహెచ్‌సీల్లో కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు.
మొదటి డోస్ వేయించుకున్నా..
మా అమ్మనాన్న అనుమతితోనే కార్బివాక్స్ టీకాను జిల్లాలోనే మొట్టమొదటి డోసు వేయించుకోవడం సంతోషంగా ఉంది. పీహెచ్సీలో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అరగంట కూర్చోబెట్టారు. నేను టీకా తీసుకున్న తర్వాతే తోటి స్నేహితులు ముందుకొచ్చి వేయించుకున్నారు.
– జీ వర్షిత, విద్యార్థి, భాగ్యనగర్‌కాలనీ, ఆదిలాబాద్